(సమీక్ష ప్రత్యేక కథనం)
సైబర్ నేరాల కేసులో అత్యంత కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి ఖమ్మం జిల్లా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అనేక సంచలన కేసుల్లో గంటల్లోనే దొంగలను, దోపిడీదారులను అరెస్ట్ చేస్తున్న తెలంగాణా పోలీస్ శాఖకు వికాస్ చౌదరి అరెస్ట్ వ్యవహారం పెను సవాల్ గా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు రూ. 549.95 కోట్ల సైబర్ దోపిడీ కేసులో కీలక నిందితుల్లో ఒకడైన వికాస్ చౌదరికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారపు నేపథ్యంలో పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా అతను వారికి చిక్కకపోవడం అత్యంత ఆసక్తికరం. గడచిన నెల రోజులుగా ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు ఎంతగా గాలిస్తున్నప్పటికీ వికాస్ చౌదరి జాడను కనుగొనకపోవడం గమనార్హం.
అస్ట్రేలియన్లు టార్గెట్ గా సాగిన ఈ సైబర్ దోపిడీ కేసులో ఇప్పటికే పోలీసులు 20 మందిని అరెస్ట్ చేశారు. పోట్రు ప్రవీణ్ సహా 18 మందిని ఓ దఫాగా, పోట్రు మనోజ్ కళ్యాణ్, అతని బామ్మర్ది మేడా కళ్యాణ్ అనే వ్యక్తులను ఇంకో దఫాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా వందలకోట్ల సొమ్మును ప్రపంచ స్థాయిలో దోచుకున్న ఈ ముఠాలో మొత్తం ఆరుగురు అసలు నిందితులు కాగా, బ్యాంకు అకౌంట్లు ఇచ్చి సహకరించారనే అభియోగంపై 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో అసలు పాత్రధారి, సూత్రధారిగా భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరి అనే వ్యక్తికి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి అండదండలున్నట్లు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లికి చెందిన ఓ ప్రముఖ నాయకుడి తోడల్లుని కుమారుడైన వికాస్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేయకుండా పొలిటికల్ పవర్ అడ్డుపడుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి:
వాస్తవానికి ఈ కేసులో పోలీసులు తొలుత వికాస్ చౌదరినే అదుపులోకి తీసుకోగా, అత్యున్నత స్థాయి అధికార పార్టీ నేత అండగా నిలిచి, పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి విడిపించారనే కథనం ప్రచారంలో ఉంది. అయితే ఆరుగురు ప్రధాన నిందితుల్లో అతి ముఖ్యులైన ముగ్గురిలో బీఆర్ఎస్ నాయకుడు పోట్రు ప్రవీణ్ ను, బీజేపీ నాయకుడు పోట్రు మనోజ్ కళ్యాణ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. కానీ అధికార పార్టీకి చెందిన నాయకుని సమీప బంధువైన ఉడతనేని వికాస్ చౌదరి మాత్రం పోలీసులకు ఎంతకీ చిక్కకపోవడమే అసలు విశేషం.

ఈ నేపథ్యంలోనే పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ భారీ సైబర్ దోపిడీ కేసును తాజాగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఐపీఎస్ అధికారి అయినటువంటి వసుంధర యాదవ్ ఈ కేసు దర్యాప్తును సవాల్ గా స్వీకరించినట్లు సమాచారం. దీంతో ఏసీపీ ఆదేశం మేరకు పెనుబల్లి ఎస్ఐ తన టీంతో వికాస్ చౌదరి కోసం గడచిన పది రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండుసార్లు చిక్కినట్లే చిక్కిన వికాస్ చౌదరి పోలీసుల కన్నుగప్పి తప్పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మాత్రం వికాస్ చౌదరిని అరెస్ట్ చేసే అంశంలో అత్యంత పట్టుదలగా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇదే దశలో ముందస్తు బెయిల్ కోసం వికాస్ చౌదరి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా తాజాగా వ్యాప్తిలోకి వచ్చింది. నెలరోజులుగా పోలీసులకు చిక్కకుండా, దొరక్కుండా దర్జాగా తప్పించుకుంటున్న వికాస్ చౌదరిని పోలీసులు ఎప్పటికి అరెస్ట్ చేస్తారో.. చూడాల్సిందే!

