కోల్ కతా: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం రేసులో ముందున్న ప్రముఖ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రనాథ్ రథ్ కారులో ప్రయాణిస్తుండగా, దుండగులు అతనిపై తుపాకీ కాల్పులు జరిపారు. ఆగంతకులు కాల్చిన నాలుగు బుల్లెట్లలో మూడు చంద్రనాథ్ రథ్ కు తలిగాయి. చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తున్న కారు వేగం తగ్గిన సమయంలో, అనుమానిత దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం సంచలనం రేకెత్తించింది.
చంద్రనాథ్ రథ్ చాలా కాలంగా సువేందు అధికారి వద్ద పనిచేస్తున్నారు. సువేందు ఆంతరంగిక వర్గంలో చంద్రనాథ్ రథ్ కూడా ఒకరిగా పార్టీ నేతలు పరిగణించేవారు. సువేందు అధికారి వద్ద రాజకీయ సమన్వయంతోపాటు ఇతర పనులను కూడా ఆయన పర్యవేక్షించేవారు. ఘటన గురించి తెలియగానే సువేందు అధికారి తన పీఏ మృతదేహాన్ని ఉంచిన మధ్యమ్ గ్రామ్ లోని ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. కాగా ఈ ఘటన వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తముందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సీబీఐ చేత విచారణ జరపాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ హత్యను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. బీజేపీ మద్ధతు ఉన్న దుండగులు ఎన్నికలు ముగిశాక హింసకు పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉండగా ఎన్నిక తర్వాత బెంగాల్ లో జరిగిన వేర్వేరు హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 80 మందిని అరెస్ట్ చేశామని కోల్ కతా పోలీస్ చీఫ్ అజయ్ కుమార్ నంద్ వెల్లడించారు. నిర్దిష్ట ప్రాంతాల్లో 65 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 15 మందిని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అరెస్ట్ చేశామన్నారు.

