ఖమ్మం: ప్రభుత్వ స్థలానికి సంబంధించిన అంశంలో ఖమ్మం నగరానికి చెందిన తాజా మాజీ కార్పొరేటర్, వచ్చే ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తున్న అధికార పార్టీ నాయకుడు పరస్పరం ‘పంచాయితీ’కి దిగిన ఘటన చివరికి పోలీస్ స్టేషన్ లో పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఖమ్మం నగర అధికార పార్టీలోనే గాక, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెడితే..
నగరంలోని 8వ డివిజన్ లోని వైఎస్ఆర్ నగర్-బాలప్పేట ప్రాంతంలో దాదాపు 25 మంది నిరుపేదలకు ప్రభుత్వం 2004లో ఇంటి స్థలాలను కేటాయించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేటాయించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులు వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలోనే బోడ శ్రావణ్ అనే స్థానిక నాయకుడు శనివారం ఆయా ఇళ్ల స్థలాల్లో చదును చేయిస్తుండగా, తాజా మాజీ కార్పొరేటర్ లకావత్ సైదులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చదును చేయించడానికి నువ్వెవరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సైదులు, శ్రావణ్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత సైదులు వెడుతుండగా, కాలు బెణకడంతో అతను స్వల్పంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై తాజా మాజీ కార్పొరేటర్ తోపాటు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ను ఆశిస్తున్న బోడ శ్రావణ్ అనే నాయకుడు పరస్పరం హవేలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. ఈ ఉదంతంలో ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదని, వాగ్వాదం మాత్రమే జరిగిందని, పరస్పరం తమకు ఫిర్యాదు చేసుకున్నారని హవేలీ పోలీస్ స్టేషన్ సీఐ భాను ప్రకాష్ వివరించారు. ఇది పార్టీల సమస్య కాదని, ఇద్దరు వ్యక్తుల సమస్య మాత్రమేనని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
