ఢిల్లీ: ఇటీవలి కాలంలో రైళ్లలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై రైల్వే భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది.
రైల్వే శాఖ తన ప్రకటనలో ఏం చెప్పిందంటే.. ‘ఈరోజు, హౌరాలో ఆగి ఉన్న మిథిలా ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో దర్యాప్తు నిర్వహించగా, పెట్రోల్‌లో తడిసి, సగం కాలిపోయిన ఒక గుడ్డ ముక్క లభించింది. రైల్వే సిబ్బంది చురుగ్గా స్పందించి, పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చి, ఓ పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడానికి, రైల్వే వ్యవస్థలో భయాందోళనలు, గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)తోపాటు సంబంధిత ఏజెన్సీలు ఈ విషయాలన్నింటిపైనా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నాయి.’ అని రైల్వే శాఖ తన ప్రకటనలో వివరించింది.
అదేవిధంగా రాజస్థాన్ లోని అమర్ పుర, కోటా, బీహార్ రాష్ట్రంలోని ససారమ్, బెంగాల్ లోని హౌరా ప్రాంతాల్లో జరిగిన ప్రమాద ఘటనలను రైల్వే శాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది.

