Top 5 This Week

Related Posts

‘ఫ్యూచర్ సిటీ’పై మంత్రి పొంగులేటి కీలక సమీక్ష

హైదరాబాద్: దేశానికే తలమానికంగా ‘ఫ్యూచర్ సిటీ’ నిలుస్తుందని తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యంగా ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పొంగులేటి పర్యటించారు. నిర్మాణంలో గల ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనాన్ని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను వివిధ శాఖల సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించి, సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనివిధంగా దేశానికే ఒక తలమానికంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు.

యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీలపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

రైతు సోదరులకు మాటిస్తున్నాం: పొంగులేటి

రైతు సోదరులకు మాటిస్తున్నామని, ఎటువంటి ఆందోళన వద్దని, తడిసిన ప్రతీ ధాన్యపు గింజను కూడా ప్రభుత్వం కొంటుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి గురువారం పర్యటించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గోదాములను సందర్శించారు.

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడి కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలను, ధాన్యం తరలింపు , తేమ శాతం నిర్ధారణ, గన్నీ బ్యాగుల లభ్యత, చెల్లింపుల జాప్యం వంటి అంశాలపై ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోళ్లు జరగాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం గింజ వదలకుండా కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.

అనంతరం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశాల్లో పాల్గొని ధాన్యం సేకరణ పురోగతి, నిల్వ సామర్థ్యం, రవాణా సౌకర్యాలు, మిల్లర్ల సమన్వయ సమస్యలపై సమగ్రంగా అధికారులతో చర్చించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, రైతుల పక్షపాతిగా ప్రజాప్రభుత్వం ఎంతటి చర్యలకైనా వెనుకాడదని అధికారులను మంత్రి పొంగులేటి హెచ్చరించారు.

Popular Articles