(సమీక్ష ప్రత్యేక కథనం)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గుర్తున్నాడుగా..! అంతటి ప్రముఖ హీరో తెలియకపోవడమేంటీ అనుకుంటున్నారా..? సినిమా హీరో సరే.. అతని ఘనకార్యం గురించి తెలుసుగా..? 1998లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ సమీపంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసు ఇప్పటికీ ఆ కండల హీరోను వెంటాడుతోంది. ఈ కేసులో 2018లో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు అయిదేళ్ల జైలు శిక్షను విధించగా, ప్రస్తుతం అతను బెయిలుపై ఉండగా, కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఇప్పుడీ కేసు ప్రస్తావన దేనికంటే.. సల్మాన్ ఖాన్ పై వచ్చిన ఆరోపణల కేసులో వేటకు గురైంది రెండు జింకలు మాత్రమే. కానీ జడ్చర్లకు చెందిన మీర్ అహ్మద్ (27) అండ్ ముఠాకు చెందిన వేటగాళ్ల తుపాకులకు బలైన జింకల సంఖ్య ఎంతో తెలుసా..? పన్నెండు జింకలకుపైగా మీర్ అహ్మద్ అండ్ ముఠా వేటాడినట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. మొత్తం కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, అందులో మీర్ అహ్మద్ నేపథ్యం ప్రత్యేకతను కలిగి ఉండడమే స్టోరీలోని అసలు విషయం.

ఇంతకీ మీర్ అహ్మద్ ఎవరో తెలుసా..? ఇతను తెలంగాణా రైఫిల్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ నాయకుడట. వృత్తిపరంగా షూటర్ అయినటువంటి మీర్ అహ్మద్ వద్ద .30-06 బోర్ స్పోర్టింగ్ లైసెన్సుడ్ రైఫిల్ ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మీర్ అహ్మద్ తోపాటు మహ్మద్ ముజాఫర్, అబ్దుల్లా బిన్ సహైన్, సౌద్ బిన్ హ్మద్ బలబ్, మసూద్ బిన్ మహ్మద్ అనే వ్యక్తులు పక్షుల వ్యాపారం, ఆప్టికల్ షాపు, రాపిడో డ్రైవర్ వంటి వృత్తులను ఎంచుకున్నప్పటికీ, వన్యప్రాణులను వేటాడడమే ప్రవృత్తిగా ఎంచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు నమోదు చేసిన కేసు ద్వారా స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి:
ఇందులో భాగంగానే ఈ ఐదుగురు సభ్యుల వేటగాళ్ల ముఠా మక్తల్ కు చెందిన కావలి శేఖర్ అనే వ్యక్తితో మిలాఖతై షాద్ నగర్, మక్తల్ అడవుల్లో ఏడాది కాలానికి పైగా స్వైరవిహారం చేశారు. గడచిన 16 నెలల వ్యవధిలో ఆయా అడవుల్లో ఈ వేటగాళ్ల ముఠా చేయని దారుణాలు లేవనే విషయాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాలే స్పష్టం చేస్తున్నాయి. మొత్తం పన్నెండుకుపైగా జింకలను, ఒక్కోటి చొప్పున నెమలి, అడవి పందిని వేటాడారు. ఇవిగాక కుందేళ్లు, కౌజు పిట్టలు, పావురాలు వంటి చిరు జీవులు కూడా ఈ ముఠా తుపాకీ తూటాలకు బలయ్యాయి. వీటి సంఖ్య ఎంతో ఇతమిద్దంగా వెల్లడి కాలేదు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో రెండో నిందితుడైన మీర్ అహ్మద్ ముఠా సాగించిన వేట కార్యకలాపాలను ఓసారి పరిశీలిస్తే వన్యప్రాణుల మనుగడపై సందేమాలు కలగక తప్పదు..
- నిరుడు జనవరి 15వ తేదీన మక్తల్ అడవుల్లో ఎయిర్ గన్ తో నెమలిని కాల్చి చంపి, దాని మాంసాన్ని తిన్నారు.
- నిరుడు మార్చి 18వ తేదీన ఎయిర్ గన్ తో అడవి పందిని కాల్చి చంపారు. ఆ తర్వాత దాన్ని మక్తల్ అటవీ ప్రాంతానికి చెందిన ఓ గ్రామస్తునికి ఇచ్చారు.
- నిరుడు ఏప్రిల్ 15-24 తేదీల్లో మక్తల్ అటవీ ప్రాంతంలో ఎయిర్ గన్ తో రెండు జింకలను కాల్చి చంపారు.
- నిరుడు మే నెలలో మక్తల్ అడవుల్లోనే ఎయిర్ గన్ తో మూడు అడవి జింకలను వేటాడారు. మే 3వ తేదీన ఒక జింకను, 25వ తేదీన మూడు జింకలను చంపారు. ఆయా జింకల మాంసాన్ని భుజించారు. మరో జింక మాంసాన్ని ముజఫర్ అనే నిందితుని ఇంట్లో గల ఫ్రిజ్ లో భద్రపరించారు.
- నిరుడు జూన్ 14వ తేదీన మక్తల్ అడవుల్లోనే అడవి జింకను, ఇతర జింకలను కాల్చి చంపి, మాంసాన్ని తిన్నారు.
- అదేవిధంగా గత నవంబర్ లో మక్తల్ అడవుల్లో ఓ దుప్పిని కాల్చి చంపారు.
- ఇక ఈ ఏడాది గత ఫిబ్రవరి 18వ తేదీన మక్తల్ లోనే అడవి జింకను ఒకదాన్ని కాల్చి చంపి, దాని మాంసాన్ని అందరూ కలిసి తినేశారు.

అయితే జింకల, ఇతర వన్యప్రాణుల వేటను నిందితుల్లో ఒకడైన ముజఫర్ మొబైల్ ఫోన్ లో వీడియో చిత్రీకరణతోపాటు ఫొటోలు కూడా తీసేవారు. ఆ తర్వాత జింకల తలలను, చర్మాలను, ఇతర అవశేషాలను సమీపంలోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాల్వల్లో పడేసేవారు. ఈ ముఠా సాగించిన వేటకు సంబంధించిన వీడియోలను, ఫొటోలలో కొన్నింటిని టాస్క్ పోర్స్ పోలీసులు బహిర్గతం చేశారు.
వేటగాళ్ల ముఠాకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మస్తిపల్లికి చెందిన కావలి శేఖర్ అనే వ్యక్తి కీలకంగా ఉండడం గమనార్హం. ముఠాకు ఇతను ఇన్ఫార్మర్ గా వ్యవహించేవాడు. వన్యప్రాణుల కదలికల, ఆచూకీపై లొకేషన్ షేర్ చేయడం ద్వారా శేఖర్ వేటగాళ్ల ముఠాకు సహకరించేవాడు. వేటాడే ప్రదేశాలను ముఠాకు చూపించడం వంటి చర్యలకు కూడా శేఖర్ పాల్పడేవాడు.
ఇదీ చదవండి:
అయితే మక్తల్, షాద్ నగర్ ప్రాంతాల్లోని అడవుల్లో ఈ ముఠా గడచిన 16 నెలలుగా స్వైర విహారం చేస్తూ వన్యప్రాణులను వేటాడుతుంటే అటవీ అధికారులు ఏం చేశారనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉద్బవిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేసి, అటవీ అధికారులను వెంటేసుకుని జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తే తప్ప మీర్ అహ్మద్ అండ్ ముఠా వేట ఆటకు చెక్ పడలేదు.

