హన్మకొండ: తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు, ఎంపీలకు సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లాలాూచీ రాజకీయం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నియమించిన కమిషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని తేల్చిందని, ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లాలూచి రాజకీయాలకు అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలలకు చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ ద్వారా సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నానని, అప్పుడు మాత్రమే బీజేపీ నిజాయితీ ప్రజలకు స్పష్టమవుతుందని పొంగులేటి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాల్లో భాగంగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాత ప్రభుత్వమని వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎన్నికల వాగ్ధానంగా నాడు ఏఐసీసీ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభ నుండి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రైతు పక్షపాతి ప్రభుత్వంగా పరిపాలనందిస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే రూ.2 లక్షల పంట రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా, దశాబ్దాల భూ సమస్యల పరిష్కారానికి “భూభారతి” వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు వారోత్సవాల్లో బాగంగా ఈనెల 5, 6, 7 తేదీలలో నిర్వహిస్తున్న ఈ రైతు మేళాలో రైతులకు అవసరమైన యాంత్రిక పరికరాలను సబ్సీడీపై అందిస్తున్నామన్నారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఖమ్మం జిల్లా పర్యటనలో..
ప్రజా సమస్యల దరఖాస్తులను ప్రజా దర్బార్ కార్యక్రమంలో నేరుగా స్వీకరించి న్యాయబద్ధమైన వాటిని పరిష్కరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. పాలేరు నియోజకవర్గంలెని ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధికారులను ప్రజల వద్దకు పంపి దరఖాస్తులు స్వీకరించామని, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్ లో 10 నుంచి 12 గ్రామాలు ఉండేలా చూసుకుని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ సమస్యలు, ప్రజల వ్యక్తిగత సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. 7 క్లస్టర్ పరిధిలో ఇప్పటి వరకు ప్రజల నుంచి పదివేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు.

