మన దేశంలో సైబర్ నేరగాళ్ల స్థావరాలేమిటి..?
పోలీసులు ‘హాట్ స్పాట్’లుగా గుర్తించిన ప్రాంతాలేమిటి..??
జార్ఖండ్ లోని జామ్ తారా, దేవ్ ఘర్ , రాజస్థాన్ లోని భరత్ పూర్, హర్యానాలోని మేవాత్, ఉత్తరప్రదేశ్ లోని మథుర, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లోని నూహ్ లతోపాటు గుర్ గ్రామ్, అల్వార్, గిరిదిహ్, బొకారో వంటి ఏరియాలు సైబర్ నేరాలకు సంబంధించి పోలీసు రికార్డుల్లో ప్రసిద్ధిగాంచాయి. దేశవ్యాప్తంగా జరిగే సైబర్ నేరాల్లో ఆయా ప్రాంతాలు సింహభాగాన్ని కలిగి ఉన్నట్లు కేసుల చరిత్ర చెబుతోంది. ఆయా ప్రాంతాలను సైబర్ క్రైం హాట్ స్పాట్లుగానూ పోలీసులు గుర్తించారు.
ఆయా ప్రాంతాల సరసన తెలంగాణాలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కూడా చేరిందంటే ఆశ్చర్యం కాదు. ఈ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుల బంధువులు, మాజీ ఎమ్మెల్యేల అనుచరులు, వివిధ పార్టీల్లో నాయకులుగా బాధ్యతులు నిర్వహించినవారు ఇప్పుడు విదేశీయులను దోచుకోవడంలో రాటుదేలారంటే ఆశ్చర్యం కాదు. ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో దోపిడీ మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు!
కేవలం సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు హైదరాబాద్ కేంద్రంగానూ వెలుగులోకి వస్తున్న పలు సైబర్ నేరాల దోపిడీ కేసుల్లో సత్తుపల్లి ప్రాంతవాసులే కీలక నిందితులుగా ఉండడం గమనార్హం. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరునిగా ప్రాచుర్యం పొందిన కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన దేవరపల్లి పట్టాభిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్ట్రేలియా పౌరులను టార్గెట్ గా ఎంచుకుని పట్టాభి గ్యాంగ్ రూ. 100 కోట్ల మొత్తాన్ని సైబర్ నేరాల ద్వారా దోపిడీ చేసిందనేది పోలీసుల అభియోగం.
ఇక సత్తుపల్లి, పెనుబల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో పోలీసులు ఇప్పటికే 55 మంది వరకు అరెస్ట్ చేశారు. అరెస్టయిన కీలక నిందితుల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల బంధువులు, పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేసిన వారు కూడా ఉండడం విశేషం. ఈ రెండు ముఖ్య కేసుల్లో రూ. 1,000 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్లు నమోదైన కేసులను ఇటీవలే హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఆయా కేసుల్లో అరెస్టయిన కీలక నిందితుల వివరాలు క్లుప్తంగా పరిశీలిస్తే..

ఉడతనేని వికాస్ చౌదరి:
చార్టెడ్ ఫ్లైట్ లో ‘దర్జా’ ఒలకబోస్తున్న ఇతను అధికార పార్టీకి చెందిన సత్తుపల్లి ప్రాంతపు ఓ కీలక నాయకుడికి బంధువు. ఆ నాయకుని తోడల్లుని కుమారుడే వికాస్ చౌదరి. ఇతన్ని అరెస్ట్ చేసేందుకు కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా వెనుకంజ వేశారంటే రాజకీయంగా అతని పలుకుబడిని అర్థం చేసుకోవచ్చు. ఓసారి వికాస్ చౌదరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, రాజకీయ ఒత్తడి కారణంగా నానక్ రాంగూడ ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్దే అతన్ని పోలీసులు వదిలేశారనే ప్రచారం జరిగింది. అయితే తీవ్ర ఒత్తిళ్ల మధ్య ఎట్టకేలకు వికాస్ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు ‘చాకచక్యంగా’ మీడియా కంటపడకుండా కోర్టులో హాజరుపర్చి రిమాండ్ చేశారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఇదే కేసులో మిగతా నిందితులకు ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వికాస్ చౌదరి అంశంలో అందుకు విరుద్దంగా వ్యవహరించడం వెనుక రాజకీయ ఒత్తిడే కారణమనే వ్యాఖ్యలు వినిపించాయి.

పోట్రు ప్రవీణ్:
సైబర్ నేరాల దోపిడీ కేసులో ఇప్పటికే అరెస్టయిన పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పోట్రు ప్రవీణ్ సన్నిహితంగా మెలిగిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పలు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన బీఆర్ఎస్ నాయకులకు ప్రవీణ్ ‘కట్టల’ కొద్దీ డబ్బును విసిరేసినట్లు ప్రచారం ఉంది. అంతేకాదు స్వగ్రామమైన కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి సర్పంచ్ గా తన తండ్రిని గెలిపించుకునేందుకు రూ. 3.00 కోట్ల మొత్తాన్ని ప్రవీణ్ ఖర్చు చేశాడనే ప్రచారం కూడా వ్యాప్తిలో ఉంది.

పోట్రు మనోజ్ కళ్యాణ్:
సైబర్ నేరాల కేసులోనే అరెస్టయిన మరో కీలక నిందితుడు పోట్రు మనోజ్ కళ్యాణ్ అనే వ్యక్తి స్థానిక బీజేపీ నాయకుడు. సత్తుపల్లి పట్టణ పార్టీ అధ్యక్షునిగా గతంలో పనిచేశాడు. పోట్రు కళ్యాణ్ ఖాతాలో రూ. 114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియ ఖాతాలో రూ. 45.62 కోట్లు, బామ్మర్ది ఖాతాలో 135.48 కోట్లు సహా మొత్తం 295.28 కోట్లు ఇతని సంబంధీకుల ఖాతాల్లోనే లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో కొల్లగొట్టిన సొమ్ము లావాదేవీల్లో మేజర్ షేర్ బీజేపీ నాయకుడు పోట్రు కళ్యాణ్ దేనని స్పష్టమవుతోంది.

దేవరపల్లి పట్టాభి:
తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన దేవరపల్లి పట్టాభి కూడా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. ఖమ్మం జిల్లాల్లోని ఓ మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరునిగా పేరుగాంచాడు. అస్ట్రేలియా పౌౌరులే లక్ష్యంగా ఇతని టీం రూ. 100 కోట్ల దోపిడీ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ తదితరులు అరెస్టయిన నేపథ్యంలో గడచిన ఏడెనిమిది నెలలుగా పట్టాభి విదేశాల్లో తల దాచుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే విదేశాల నుంచి హైదరాబాద్ లో దిగగానే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మాదాపూర్ ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
కొసమెరుపు:
ఈ మొత్తం దోపిడీ కేసుల్లో అరెస్టవుతున్న నిందితుల్లో కొందరు తమదైన ధీమాను వ్యక్తం చేస్తున్నారట. తమపై నమోదవుతున్న కేసుల్లో మూడో వ్యక్తి ఫిర్యాదు చేస్తున్నారని, ఈ తరహా కేసుల్లో తమపై మోపిన అభియోగాలను పోలీసులు న్యాయస్థానాల్లో నిరూపించలేరని ప్రచారం చేసుకుంటున్నారట. మరికొందరైతే నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి జనరల్ నియోజకవర్గంగా మారుతుందని, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారట. అదీ సైబర్ నేరాల దోపిడీ కేసుల్లో నిందితులుగా మారుతున్న కొందరి ధీమాలోని అసలు విశేషం.

