మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాల పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణా సరిహద్దు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో జరిగిన ఈఘటనలో మావోయిస్టు పార్టీ ‘కొయ్యూరు ఎన్కౌంటర్’ తరహాలో కీలక నేతలను కోల్పోవడం ద్వారా భారీ నష్టాన్ని చవి చూసింది. ఈనెల 19వ తేదీ నుంచి రెండురోజులపాటు పలుసార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన నక్సలైట్ల సంఖ్య ఇరవైకి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాల పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. కూంబింగ్ లో భాగంగా నిన్నటి నుంచి ఈ తెల్లవారుజాము వరకు జరిగిన కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన నక్సల్స్ సంఖ్య ఇరవైకి చేరుకుంది. పెద్ద సంఖ్యలో ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటి అధునాతన ఆయుధాలను, నక్సలైట్ల డెడ్ బాడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులైన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి తలపై కోటి రూపాయల నగదు రివార్డు ఉంది.
కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు అడవుల్లో 1999 డిసెంబర్ 2న జరిగిన సంచలన ఎన్కౌంటర్ లో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులను, మరో ముఖ్య నాయకున్ని కోల్పోయింది. కొయ్యూర్ ఘటనలో సెంట్రల్ ప్రొవిజనల్ కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, కేంద్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళి మరణించారు. కేంద్ర కమిటీ స్థాయి నాయకులను కోల్పోయిన ఘటనల్లో కొయ్యూరు తర్వాత బహుషా గరియాబంద్ ఎన్కౌంటర్ ఉదంతమే కావచ్చని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు భావిస్తున్నారు.

కాగా గరియాబంద్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈమేరకు ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో ఘటనపై వ్యాఖ్యానించారు. నక్సల్స్ రహిత భారత్ లో మన భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని కొనియాడారు. దేశ సంకల్పం నెరవేరబోతోందని అమిత్ షా పేర్కొన్నారు.

