Top 5 This Week

Related Posts

పీసీసీ చీఫ్ మహేష్ వినతికీ జీవన్ రెడ్డి నో

జగిత్యాల: చివరి ప్రయత్నమూ ఫలించలేదు.. కాంగ్రెస్ తో కొనసాగేందుకు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి నిరాకరించారు. కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధపడిన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు చివరి ప్రయత్నంగా జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. నాలుగు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు జీవన్ రెడ్డిని చేసిన అభ్యర్థనకు సైతం ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు చేసిన అభ్యర్థనను కూడా జీవన్ రెడ్డి నిర్దంద్వంగా తోసిపుచ్చారు. కాంగ్రెస్ తో బంధం నేటితో ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొనగా, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ సమీకరణాలవల్ల జీవన్ రెడ్డి ఇబ్బందులకు గురయ్యారని, భవిష్యత్తు విషయాలపై చర్చించుకుందామని, రాజీనామా అంశాన్ని వెనక్కి తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

జీవన్ రెడ్డితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, పక్కన ఆది శ్రీనివాస్, సచిన్ సావంత్

ఇదివరకే తన అభిప్రాయాన్ని ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ దృష్టికి తీసుకెళ్ళానని, ఇప్పుడు సమస్య పరిష్కారం ఎవరి చేతిలోనూ లేదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెడతానని, తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో ఊహించలేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పీసీసీ చీప్ మహేష్ సహా మిగతా నాయకులు వెనుదిరగక తప్పలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏ పార్టీలోకి వెళ్తారనేది జీవన్ రెడ్డి వెల్లడించకపోవడం గమనార్హం.

జీవన్ రెడ్డి ఇంటికి గల ‘ఇందిరా భవన్’ ఫ్లెక్సీని తొలగిస్తున్న దృశ్యం

ఇదే దశలో జీవన్ రెడ్డి తన ఇంటికి గల ‘ఇందిరా భవన్’ పేరుతో గల ఫ్లెక్సీ ని తొలగించారు. రేపటి రాజీనామా మీటింగ్ ఏర్పాట్లలో జీవన్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు నిమగ్నమయ్యారు. రాజకీయంగా జీవన్ రెడ్డి తదుపరి పయనం ఎటువైపు అనేది ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా రాజీకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.

Popular Articles