Top 5 This Week

Related Posts

పిండిప్రోలు హత్యోదంతం: ఇదీ అసలు కొసమెరుపు!

తిరుమలాయపాలెం: నేరాలకు పాల్పడే వ్యక్తులు ఘటనా స్థలంలో ఖచ్చితంగా తమకు ఏదో ఒక క్లూను వదిలేసే వెడతారనేది పోలీసుల గట్టి నమ్మకం. పోలీసుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖమ్మం జిల్లా పిండిప్రోలులో గత నెల 17వ తేదీన అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన చెన్న సుగుణ అనే వృద్ధురాలి హత్యోదంతంలో హంతకుడు ఇలాంటి ఆధారంతోనే సాంకేతికంగా చిక్కడం విశేషం.

ఇదీ హత్య జరిగిన తీరు:
ఖమ్మం-వరంగల్ స్టేట్ హైవే ప్రధాన రహదారిలోనే గల పిండిప్రోలులో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. గతనెల 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో పిండిప్రోలులోని తమ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు సుగుణ వద్దకు ఆగంతకుడు వెళ్లాడు. నిద్రలోకి జారుకున్న సుగుణ మెడలోని బంగారు ఆభరణాలను లాక్కునేందుకు ఆగంతకుడు ప్రయత్నించాడు. కేకలు వేస్తూ పక్కనే గల కారంపొడిని సుగుణ ఆగంతకుని కళ్లలో చల్లింది. దీంతో ఆగంతకుడు సుగుణ తలపై బలమైన ఆయుధంతో బాది దారుణంగా హత్య చేసి, ఆమె మెడలోని బంగారాన్ని లాక్కుని వెళ్లాడు.

వాస్తవానికి ఈ హత్యోదంతం ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ పోలీసులకు దర్యాప్తులో సవాల్ గా మారిందనే చెప్పాలి. ఒకానొక దశలో సుగణ భర్త జనార్థన్ హత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ పోలీసులు కూపీ లాగారు. అందుకు భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలే కారణమనే భావనతోనూ అనుమానించారు. కానీ పక్షవాతంతో మంచానపడి, సరిగ్గా నడవలేని స్థితిలోగల ఆమె భర్త హత్యకు పాల్పడే ఛాన్సే లేదని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు అసలు దర్యాప్తును ప్రారంభించడం గమనార్హం.

హత్యకు గురైన సుగుణ (ఫైల్ ఫొటో)

నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు:
ఒకరిద్దరు పోలీసులు కాదు.. ఖమ్మం రూరల్ ఏసీపీ బి. తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో కూసుమంచి సీఐ టి. సంజీవ్, అటు తిరుమలాయపాలెం, ఇటు కూసుమంచి, ఖమ్మం రూరల్ స్టేషన్ల ఎస్ఐలు, ఇతర సిబ్బందితో కలిసి నాలుగు టీంలుగా దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన తర్వాత డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో పోలీసులు హంతకుని కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు.

ఇరవై రోజులకు పైగా నాలుగు దర్యాప్తు బృందాలు జల్లెడపట్టినప్పటికీ, చాలారోజుల వరకు హంతకుని జాడపై పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు కూడా లభించలేదు. గ్రామంలోని సీసీ కెమెరాలను పోలీసులు ఎంతగా పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. పిండిప్రోలు గ్రామాన్ని జల్లెడ పట్టి మరీ పోలీసులు పరిశోధించారు. కానీ హంతకుని జాడ మాత్రం చిక్కలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ హత్యోదంతం పోలీసులు అతిపెద్ద సవాల్ గా మారింది.

ముందే చెప్పుకున్నట్లు హంతకుడు పోలీసులకు ‘ఆధారం’ వదిలే వెళ్లాడు. వృద్ధురాలు సుగుణ ఇంటి పక్కనే చికెన్ షాపు నడిపే ఐతనబోయిన ప్రశాంత్ అనే యువకుడిపై పోలీసులను అనుమానం కలిగింది. సాంకేతికతతో ప్రశాంత్ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. హత్య జరిగినరోజు ప్రశాంత్ కదలికలపైనా విచారణ జరిపారు. పోలీసుల అనుమానమే నిజమైంది. వృద్ధురాలు సుగుణను దారుణంగా హత్య చేసింది ప్రశాంతేనని నిర్ధారణకు వచ్చారు.

హంతకున్ని పట్టుకోవాలంటూ పిండిప్రోలు గ్రామస్తులు ఆందోళన నిర్వహించినప్పటి చిత్రం

ప్రశాంత్ ఈ ఘటనకు పాల్పడడానికి దారి తీసిన పరిస్థితులను ఖమ్మం రూరల్ ఏసీపీ బి. తిరుపతిరెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. పిండిప్రోలులో చికెన్ షాపు నిర్వహిస్తున్న ప్రశాంత్ కు మద్యం సేవించడం, ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడడం వంటి వ్యసానాలు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. తన చికెన్ షాపుల సమీపంలోనే నివసిస్తున్న సుగుణ-జనార్థన్ వృద్ధ దంపతులను గమనించసాగాడు. సుగుణ మెడలో బంగారు ఆభరణాలను గమనించి, దోచుకునేందుకు పథకం రచన చేశాడు.

ఇందులో భాగంగానే గతనెల 17వ తేదీన ఆర్థరాత్రి సమయంలో వృద్ధురాలు సుగుణ ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటిపై గల నగలను దోచుకునేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ ను సుగుణ ప్రతిఘటించింది. దీంతో తనవెంట తీసుకువెళ్లిన ఇనుపరాడ్డుతో ఆమెపై దాడిచేసి, హత్యకు పాల్పడడం ద్వారా మెడలోని బంగారు గొలుసును, నల్లపూసల చైన్ కు సంబంధించిన బిళ్లలను (ఏసుల) తీసుకుని పరారయ్యాడు.

ఆ తర్వాత దొంగిలించిన బంగారు చైన్ ను తనకు వరుసకు బామ్మర్ధి అయ్యే సరగండ్ల మహేష్ కు ఇచ్చి, బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకురావాలని పురమాయించాడు. దీంతో మహేష్ ఆబంగారాన్ని తన పేరుతో ఖమ్మంలోని ఓ బ్యాంకులో కుదువపెట్టి రూ. 1.50 లక్షల రుణం తీసుకున్నాడు.

అయితే ఇక్కడే నిందితుడు ప్రశాంత్ పోలీసులకు చిక్కడం విశేషం. హత్య జరిగినరోజు, ఆతర్వాత మహేష్ కదలికలను, అతని ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న దర్యాప్తు టీంలకు గల అనుమానమే భ్రుకుటపడింది. హత్యానంతరం సుగుణ నుంచి దోచుకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి తీసుకున్న రూ. 1.50 లక్షల మొత్తాన్ని ఇద్దరు వ్యక్తుల బాకీ తీర్చేందుకు వినియోగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు సమాచారం.

సాంకేతిక ఆధారాలతోనే ఈ హత్య కేసును ఛేదించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి మీడియాతో చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడైన పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్ (26), అతనికి సహకరించిన మరిపెడ మండలం బాలిని ధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్ (20)ను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

నిందితుల నుంచి తొమ్మిది బంగారు బిళ్లలు, రెండు మొబైల్ ఫోన్లను, నేరానికి ఉపయోగించిన బైకును, రక్తపు మరకలు గల ఇనుపరాడ్డు, గోల్డ్ లోన్ కు సంబంధించిన పత్రాన్ని స్వాధీనం చేసుకున్నామని, కేసుకు సంబంధించి ఇతర అంశాలపై దర్యాప్తు సాగుతోందని ఏసీపీ చెప్పారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశంతో నాలుగు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు కేసును ఛేదించినట్లు చెప్పారు.

దర్యాప్తుపరంగా అత్యంత క్లిష్టంగా, సవాల్ గా పరిణమించిన కేసులో సమర్ధవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను పట్టుకున్న కూసుమంచి సీఐ టి. సంజీవ్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ స్టేషన్ల ఎస్ఐలు కె. జగదీష్, పి. సంతోష్, జె. నాగరాజు, ప్రొబేషనరీ ఎస్ఐ పి. దివ్యశ్రీ, సిబ్బంది పూర్ణచందర్ రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనులను ఏసీపీ తిరుపతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించి, రివార్డులను ప్రదానం చేశారు.

ఏసీపీ తిరుపతిరెడ్డి కీలక సూచన:
కాగా ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. స్వల్ప ఖర్చుకు వెనుకాడి సీసీ కెమెరాలను ఏర్పరచుకోకుంటే ఇటువంటి ఘటనల్లో పోలీసులకు దర్యాప్తు కష్టతరంగా మారుతోందన్నారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరిస్తూ తమ ఇళ్లముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

కొసమెరుపు:
వృద్ధురాలు సుగుణ హత్యోదంతంలో అసలు కొసమెరుపు ఏమిటంటే.. హంతకులను పట్టుకోవాలని స్థానికులు నిర్వహించిన ఆందోళన, ధర్నా వంటి కార్యక్రమాల్లో నిందితుడు ఐతనబోయిన ప్రశాంత్ కూడా పాల్గొన్నాడట. అంతేకాదు పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తూ, క్లూస్ కోసం వెతుకుతున్న సందర్భంలోనూ ప్రశాంత్ పోలీసుల వెంటే తిరుగుతూ ఉన్నాడట. అయితే హత్యచేసి, చోరీ చేసిన బంగారాన్ని బ్యాంకులో కుదువపెట్టి, తీసుకున్న రుణపు మొత్తాలను బాకీలుగా తీరిస్తే సాంకేతికతతో పోలీసులకు చిక్కుతానని బహుషా నిందితుడు ప్రశాంత్ ఊహించి ఉండకపోవచ్చు.

Popular Articles