కొణిజర్ల: ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన చికిత్స వికటించి బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటు చేసుకుంది. అయితే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షనే కారణమని బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు తమకు అందిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటన పూర్వాపరాల్లోకి వెడితే.. కొణిజర్ల మండలం బస్వాపురానికి చెందిన చల్లా రమేష్–మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ (14) గ్రామ సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా స్కూలు నుంచి హేమాశ్రీని తండ్రి ఇంటికి తీసుకువచ్చారు. అయితే జలుబు, జ్వరంతో బాధపడుతున్న తమ కుమార్తె హేమశ్రీని ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ వద్దకు తీసుకెళ్లారు.
చికిత్సలో భాగంగా ఆర్ఎంపీ వైద్యుడు బాలిక చేతికి ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ టెస్టు చేసి హేమశ్రీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే హేమశ్రీకి వైద్యం చేసిన సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ మద్యం సేవించి ఉన్నాడనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. బాలిక మృతి చెందిన అనంతరం ఖమ్మం పోలీసులు సంపత్ కు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే చికిత్స చేసిన సమయంలోనే ఆర్ఎంపీ మద్యం సేవించాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఖమ్మంలో ఆర్ఎంపీకి డ్రంకెన్ టెస్టు చేశారని, ఈ విషయాన్ని తెలుసుకోవలసి ఉందని కొణిజర్ల ఎస్ఐ మీడియాకు చెప్పారు.
కాగా తమ కుమార్తె మృతికి ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ నిర్లక్ష్యపు వైద్యమే కారణమని మృతురాలి తండ్రి చల్లా రమేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆర్ఎంపీ వైద్యుదు పరారీలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.

