హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి చెప్పారు. రెవెన్యూ అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ అంశంపై ఆయా కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది అతని జీవనాధారమని పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నిర్వహించనున్న ఈ రీ-సర్వే కార్యక్రమం చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం కాలపు సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయన్నారు. కాలక్రమేణా భూముల విభజనలు, ఉపసంఖ్యలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దులు మారడం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల అసలు హద్దులపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం సమగ్ర రీ-సర్వే చేపడుతోందని తెలిపారు.
భూ వివాదాల పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలో నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించామని, వాటిలో ఇప్పటికే 5 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూదార్ నంబర్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నామని మంత్రి తెలిపారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 411 రోవర్స్ కొనుగోలు చేయగా, త్వరలో మరో 400 రోవర్స్ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతి సర్వే నంబర్‌కు భూదార్:
భూముల రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూ కమతానికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూదార్ కార్డులు జారీ చేస్తామన్నారు. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం అవి 2 కోట్ల 29 లక్షలకు పెరిగాయని, రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించిందన్నారు.
రీ-సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం సమకూర్చిందని, 5,520 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేశామని చెప్పారు. భూవిస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది సర్వేయర్లను నియమించామని తెలిపారు. రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భూముల రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి కమతానికి ఖచ్చితమైన సరిహద్దులు, ప్రత్యేక పటాలు సిద్ధమవుతాయన్నారు. తద్వారా భూ యాజమాన్యంపై ఎలాంటి వివాదాలకు తావు ఉండదన్నారు. భూ భారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో రీ-సర్వే ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనున్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

