ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతుపై విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతం తీవ్ర విమర్శలకు తావు కల్పిస్తోంది. డమ్మీ బోరు బావులకు విద్యుత్ లైన్ ఇచ్చి, ట్రాన్స్ కో అధికారులు అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పాపానికి రైతును లక్ష్యంగా చేసుకుని విద్యుత్ శాఖ అధికారి పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేయడమేగాక, ఓ రోజంతా పోలీస్ స్టేషన్ లో రైతును కూర్చోబెట్టించిన ఉదంతం కలకలం రేపుతోంది.
ప్రభుత్వంలో విద్యుత్ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వర్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ అధికారి ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా వైరా సబ్ డివిజన్ లోని తల్లాడ పోలీసులు ఆ రైతును ఓ రోజంతా పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి, ఆ తర్వాత పరిణామాల్లో విచారణ జరుపుతున్న తీరు వార్తాంశంగా మారింది. మరో ఐదారు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న పరిణామాల్లో రైతుపై ట్రాన్స్ కో ఏఈ ఫిర్యాదు తీవ్ర వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెడితే..
బాధిత రైతు కథనం ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడేనికి చెందిన చింతల నాగరాజు అనే రైతు పంట పొలం నుంచి ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ లైన్ వేశారు. అయితే ఈ లైన్ పొలం గెట్టు పైనుంచిగాని, కనీసం 5 అడుగుల లోపలికిగాని వేయకుండా రైతుల భూముల ‘హద్దు’కు కేవలం జానెడు దూరంలో వేయడం వల్ల తమ మధ్య సమస్యలకు ఆస్కారం కలుగుతుందని చింతల నాగరాజు అనే రైతు అధికారులకు చెప్పారు. కనీసం తనకు చెప్పాపెట్టకుండా తన పొలం నుంచి వేసిన విద్యుత్ లైన్ స్తంభాన్ని తొలగించాలని రైతు వారిని అభ్యర్థించారు.

రైతులందరూ ఇప్పుడు పామాయిల్, జామాయిల్ వంటి ‘పై పంటలు’ వేయడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని, కింది పంటలైతే సమస్య ఉండదని, స్తంభాన్ని తొలగించాని రైతు కోరారు. ఈ అంశంలో తన అభ్యర్థనను ట్రాన్స్ కో అధికారులు నిర్లక్ష్యం చేశారని, దీంతో తాను ఉన్నతాధికారులను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డమ్మీ బోర్లకు విద్యుత్ లైన్ లాగారని, ఈ అంశంలో అవినీతి చోటు చేసుకుందనేది చింతల నాగరాజు ట్రాన్స్ కో ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు సారాంశం. విద్యుత్ శాఖ అధికారుల వ్యవహార శైలిపై రైతు నాగరాజు తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) వరుణ్ రెడ్డికే నేరుగా ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా సమాచారం అందించడమేగాక, లిఖిత పూర్వకంగానూ ఫిర్యాదు చేసినట్లు రైతు నాగరాజు పేర్కొన్నారు.
దీంతో స్థానిక విద్యుత్ శాఖకు చెందిన ఏఈపైనేగాక, మరో అధికారిపై TGNPDCL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి, డమ్మీ బోర్లకు విద్యుత్ లైన్ వేసిన మాట వాస్తవమేనని ధ్రువీకరించి వరుణ్ రెడ్డికి నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. డమ్మీ బోర్లకు విద్యుత్ లైన్ వేయడంలో ‘అవినీతి’ అంశం కూడా దాగి ఉందని విజిలెన్స్ విభాగపు అధికారులు వరుణ్ రెడ్డికి నివేదించినట్లు ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏమిటనేది అధికారికంగా వెల్లడి కావలసి ఉంది. అయితే ఈ అంశంలో విజిలెన్స్ విచారణ, నివేదిక పరిణామాల్లో తమపై ఏవేని చర్యలు ఉండవచ్చని అంచనా వేసిన విద్యుత్ అధికారులు రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్రాన్స్ కో విభాగానికి చెందిన తల్లాడ ఏఈ రాయల ప్రసాద్ రైతు నాగరాజుపై పలు అభియోగాలను మోపుతూ ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతల నాగరాజుకు వ్యవసాయ బోరు లేకపోయినా, నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలని తమను ఇబ్బంది పెడుతున్నాడని, నిబంధనల ప్రకారం కుదరదని చెప్పినందుకు తమపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని ఏఈ ప్రసాద్ తన ఫిర్యాదులో ఆరోపించారు. అంతేగాక తమ అధికారుకు ఫోన్లు చేసి తమపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని, తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. రైతుల వద్ద డబ్బు తీసుకున్నానని గ్రామాల్లో అపవాదు ప్రచారం చేస్తూ, అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, తమ విధులకు ఆటంకం కలగిస్తూ, మానసికంగా వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఏఈ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు.
దీంతో తల్లాడ పోలీసులు రైతు చింతల నాగరాజును ఈనెల 18వ తేదీన స్టేషన్ కు పిలిపించి ఓ రోజంతా కూర్చోబెట్టినట్లు సమాచారం. ఇదే అంశంపై తల్లాడ ఎస్ఐ వెంకటక్రిష్ణను ‘సమీక్ష’ వివరణ కోరగా, నాగరాజుపై విద్యుత్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై ఒక్క రోజు మాత్రమే స్టేషన్ కు పిలిపించామని, మళ్లీ అతన్ని తాము స్టేషన్ కు పిలవలేదన్నారు. ఏఈ ఇచ్చిన ఫిర్యాదును ఆన్ లైన్ మాత్రమే చేశామని, రైతుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. రైతు నాగరాజు, ఏఈ ప్రసాద్ ల వాదనలపై ప్రాథమికంగా విచారణ జరిపామని, పూర్తి విచారణ చేశాక ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామని ఎస్ఐ వెంకటక్రిష్ణ వివరించారు.

