ఖమ్మం: ఓటరు జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సర్’ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని ఉద్భోదించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను దొంగదారి చర్యగా అభివర్ణించారు.
చిన్న చిన్న కారణాలతో ఓట్లను తొలగించవచ్చని, ఓటర్ల పేర్లనేగాక, నాయకుల పేర్లను కూడా జాబితాలో లేకుండా చేసే ప్రమాదముందని, చివరికి తన ఓటు కూడా గల్లంతు చేసే అవకాశం లేకపోలేదని మంత్రి వ్యాఖ్యానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) అవగాహన శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ, చట్టం రూపంలో కేంద్ర పాలకులు నిర్వహిస్తున్న ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందని అన్నారు.
ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, రావుకు బదులు రెడ్డి, హుస్సేన్ బదులు శ్రీ అని ఉన్నా.. వాటన్నింటినీ సాకుగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారని, అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారని, దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓటు మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉద్యోగాలు, చదువుల రీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉండే మన వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాన్ని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్ గెలుపునకు కావలసిన ఓట్ల కంటే 11 ఎక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేశారని ఆరోపించారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్ళు దొంగిలించారని, నిన్నటి వరకు ఓట్లను దొంగిలించిన వాళ్ళు, ఈరోజు ఏకంగా సీట్లనే దొంగిలించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిందని మంత్రి పేర్కొన్నారు.
కాగా తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని బీజేపీ ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వాడుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో గల సీబీఐ , ఈడీ , ఇన్‌కమ్ టాక్స్ సంస్థలను అడ్డం పెట్టుకుని, వేరే పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, భారతదేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా ఇదే రకమైన దుర్మార్గపు పరిపాలన సాగుతోందని పొంగులేటి అన్నారు.

