Top 5 This Week

Related Posts

ఎంపీ సీట్ల పెంపుదలపై సీఎం రేవంత్ అభ్యంతరం

ఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50 శాతం సీట్లు పెంచుతూ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే, రేపటి రోజున జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని అభిప్రాయపడ్డారు. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా పోతుందని సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘భారతదేశం – ప్రపంచం’ అన్న ఇతివృత్తంపై ఓ టీవీ ఛానల్ నిర్వహించిన “వాట్ ఇండియా థింక్స్ టుడే” సమ్మిట్ 2026 లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ విజన్ 2047, పరిపాలన, రాజకీయ స్థితిగతులపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం మేరకు సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై తొలుత అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందని అన్నారు. అలా కాకుండా ముందే నిర్ణయం తీసుకుని, తర్వాత అందరి అభిప్రాయాలు అడగడటం సమంజసం కాదన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలనే మేం కోరుకుంటున్నామని చెప్పారు. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురికావడమే కాకుండా తీరని నష్టం జరుగుతుందని అన్నారు.

మంచి ఎక్కడున్నా స్వీకరిస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ ట్రెయిన్లు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పానని గుర్తుచేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత సమస్యను ఎదుర్కొనడానికి కార్యాచరణ ప్రకటించాలని సీఎం రేవంత్ కోరారు.

Popular Articles