సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో పానీ పూరీ తిన్న 20 మంది ఆసుపత్రి పాలైన ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ లో పానీ పూరి తిని వీరందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇందులో పన్నెండు మంది చిన్నారులు నిన్న రాత్రే అస్వస్థతకు గురై, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా, బుధవారం మరో ఎనిమిది మంది పెద్దవాళ్లు కూడా ఆసుపత్రి పాలు కావడం గమనార్హం.

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్ లో ఓ వ్యక్తి తోపుడు బండిపై నిత్యం పానీ పూరీ విక్రయిస్తుంటాడు. పిల్లలు, పెద్దలు అనేక మంది ఇతని బండి వద్ద పానీ పూరీ తింటుంటారు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడ పానీ పూరీ తిన్న పన్నెండు మంది చిన్నారులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన పిల్లలను వారి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

అస్వస్థతకు గురైన పెద్దవాళ్ల, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని, అందరూ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఫడ్ పాయిజన్ ఈ పరిస్థితికి కారణంగా ప్రాథమికంగా వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పానీ పూరీ తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా..? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే అంశంపై బాధిత పిల్లల తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
