రాయపూర్: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగీ కుమారుడు అమిత్ జోగీకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్‌సీపీ నాయకుడు రామావతార్ జగ్గీ 2003లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో అమిత్ జోగీకి హైకోర్టు ఈ శిక్షను విధించింది. రామావతార్ జగ్గీ హత్య కేసులో అమిత్ జోగీని నిర్దోషిగా విడుదల చేస్తూ 2007లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పును రద్దు చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 120-బి కింది శిక్షార్హమైన నేరానికి అమిత్ జోగీని దోషిగా తేలుస్తూ, అతనికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 1,000 మొత్తాన్ని జరిమానాగా కూడా విధించింది. జరిమానాను చెల్లించడంలో విఫలమైతే అదనంగా ఆరునెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఛత్తీస్ గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది.
అజిత్ జోగీ ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2003 జూన్ 4వ తేదీన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రామావతార్ జగ్గీ హత్యకు గురయ్యారు. ఈ కేసును తొలుత రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయగా, ఆ తర్వాత సీబీఐకి బదిలీ చేశారు. దీంతో అమిత్ జోగీ సహా పలువురు నిందితులపై సీబీఐ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో 28 మంది నిందితులపై అభియోగాలను ప్రాసిక్యూషన్ విజయవంతంగా నిరూపించిందని పేర్కొంటూ 2007 మే 31వ తేదీన రాయపూర్ లోని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే అమిత్ జోగీని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది.
ఆ తర్వాత సీబీఐ ఈ తీర్పును సవాల్ చేసింది. కానీ జాప్యం జరిగిందనే కారణంతో 2011లో హైకోర్టు పిటిషన్ ను కొట్టేసింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతోపాటు మృతుని కుమారుుడ సతీష్ జగ్గీ దాఖలు చేసిన వేర్వేరు అప్పీళ్లను కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అమిత్ జోగీని నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ నిరుడు నవంబర్ లో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఛత్తీస్ గఢ్ సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఛత్తీస్ గఢ్ హైకోర్టు గత నెలలో ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభించి, తాజా తీర్పునిచ్చింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమిత్ జోగీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు ఏప్రిల్ 20వ తేదీని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

