మధురై: తండ్రీ, కుమారులను లాకప్ డెత్ చేసినట్లు రుజువైన కేసులో తమిళనాడులోని మధురై మెదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధారిస్తూ వారికి మరణశిక్ష విధించింది. సాత్తన్ కుళంలోని తండ్రీ, కుమారులైన జయరాజ్, బెన్నిక్స్ 2020లో లాకప్ లో హత్యకు గురైన కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. మృతుల కుటుంబానికి నేరానికి బాధ్యులైన పోలీసు అధికారులు మొత్తం రూ. 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన పోలీసు అధికారులే స్వయంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి, ఎటువంటి నేర చరిత్ర లేని ఆ తండ్రీకొడుకులను అత్యంత దారుణంగా హింసించినందున, ఇది ఒక అరుదైన కేసుగా మధురై కోర్టు న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో బాధ్యులైన ఆ తొమ్మిది మంది పోలీసు అధికారులను IPC సెక్షన్లు 342, 195, 211, 218, 302 (వీటితో పాటు సెక్షన్లు 109, 34) కింద నేరాలకు పాల్పడినట్లు మార్చి 23వ తేదీన కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది.

నిందితుల గత ఆస్తి వివరాలను, వారి జీతభత్యాల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన నివేదికలను కూడా కోర్టు కోరింది. శిక్షను పెంచడానికి లేదా తగ్గించడానికి దోహదపడే పరిస్థితుల (aggravating/mitigating circumstances) పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా కోర్టు నివేదిక కోరింది. ఈమేరకు ఏప్రిల్ 2వ తేదీన ఆయా నివేదికలు కోర్టుకు సమర్పించారు. అనంతరం శిక్ష విధింపుపై కోర్టు ఇరుపక్షాల వాదనలను ఆలకించింది. ఈ కేసులో గరిష్ట శిక్ష అయిన మరణశిక్షను విధించాలని సీబీఐ గట్టిగా వాదించగా, నిందితుల తరపు న్యాయవాదులు కనిష్ట శిక్ష విధించాలని అభ్యర్థించారు.
కోవిడ్ సమయంలో రాత్రి 9 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉంచారని, అప్పట్లో అమల్లో ఉన్న కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ సాత్తన్‌కుళం పోలీసులు అదుపులోకి తీసుకుని హింసించడం వల్ల జయరాజ్, అతని కుమారుడు బెన్నిక్స్ మరణించిన ఆ దారుణ ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఆ తండ్రీకొడుకులను 2020 జూన్ 19వ తేదీన సాత్తన్‌కుళం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు వారిని అత్యంత దారుణంగా హింసించి, IPC సెక్షన్లు 188, 269, 294(b), 353, 506(2) కింద రిమాండ్‌కు తరలించారు. అయితే జూన్ 22న బెన్నిక్స్, జూన్ 23న జయరాజ్ గాయాల వల్ల మరణించారు.

ఈ ఘటనానంతరం మొత్తం 10 మంది పోలీసు అధికారులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వారిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నారు. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం కూడా ఈ అంశాన్ని సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణకు స్వీకరించింది. ఈ సుమోటో కేసు విచారణ సందర్భంగా, సంబంధిత అధికారులపై హత్య ఆరోపణలకు సంబంధించి ప్రాథమికంగా బలమైన ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు సంబంధిత సాక్ష్యాధారాలను అధికారులు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా కోర్టు గుర్తించి, దర్యాప్తు బాధ్యతలను తక్షణమే స్వీకరించాలని సీబీసీఐడీ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ను ఆదేశించింది.
కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరిగేలా చూసేందుకు, డీజీపీ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసింది. అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు పి. రఘు గణేష్, కె. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్, ఎ. సామిదురై, కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజ్, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్, ఎస్. వేలుముత్తు, స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాల్దురైలపై భారత ఐపీసీ సెక్షన్లు 302, 342, 201, 182, 193, 211, 218, 120(B), 34 కింద నేరారోపణలు నమోదు చేశారు. అయితే కేసు విచారణ కొనసాగుతుండగానే స్పెషల్ ఇన్స్పెక్టర్ పాల్దురై కోవిడ్-19 కారణంగా మరణించారు.
న్యాయమూర్తి సోమవారం తీర్పును వెలువరిస్తూ, జయరాజ్, బెన్నిక్స్‌లకు తగిలిన గాయాలు సహజమైనవి కావని, ఆ గాయాలే అంతిమంగా వారి మరణానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ఆ గాయాలు వారంతట వారే చేసుకున్నవని చేసిన వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. పోస్ట్‌మార్టం నివేదికల ప్రకారం ఆ గాయాలు పదేపదే జరిగిన దాడి ఫలితమేనని కోర్టు గుర్తించింది.
జయరాజ్‌కు గుండె సంబంధిత అనారోగ్య చరిత్ర ఉన్నప్పటికీ, అతని మరణం ఆ అనారోగ్యం వల్ల సంభవించిందని చెప్పలేమని పేర్కొంది వాస్తవానికి పోలీసుల చేతిలో పదేపదే జరిగిన గాయాల వల్లే ఆ మరణం సంభవించిందని కోర్టు స్పష్టీకరించింది. తండ్రీ కుమారుల మరణం హత్య కేసుగా నిర్ధారించిన కోర్టు ఆయా తొమ్మిది మంది పోలీసు అధికారులను దోషులుగా తేల్చి, వారికి మరణ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

