ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వైరా నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న AP39C 6369 అనే నెంబర్ గల కారు, ఖమ్మం నుంచి వైరా వైపు వస్తున్న AP16 TG 8359 అనే నెంబర్ గల లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురితోపాటు, లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే నలుగురిలో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. చనిపోయినవారిలో రాజమండ్రికి చెందిన ఉండమట్ల వీర్రాజు (48), అతని భార్య వీరశైలజ (36) ఉన్నారు. విజయవాడలోని గుణదలకు చెందిన లారీ డ్రైవర్ షేక్ జానీ బాషా, ఉండమట్ల యశ్వంత్ (15) ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా పదో తరగతి పాసైన తమ కుమారుడు యశ్వంత్ ను కళాశాలలో చేర్పించేందుకు వీర్రాజు దంపతులు హైదరాబాద్ వెడుతుండగా ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు ఖమ్మం-వైరా మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

