హైదరాబాద్: అమెరికా పౌరులను టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈమేరకు అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టును హైదరాబాద్ ఈడీ అధికారులు రట్టు చేశారు. గడచిన మూడేళ్లుగా వ్యవస్థీకృత సైబర్ నేరాలకు పాల్పుడుతున్న హర్షల్ రాహుల్ ముఠాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
అమెరికా సిటిజన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఈ మూటా ఫేక్ కాల్ సెంటర్ నిర్వహణ ద్వారా వందలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమెరికా పౌరులను నిందితులు బురిడీ కొట్టించారు. తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హర్షల్ రావల్ ముఠా ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. అయితే మాదాపూర్ కాల్ సెంటర్‌పై దాడులు జరగడంతో పంజాబ్‌లోని పాటియాలకు ఈ ముఠా మకాం మార్చింది. తద్వారా అక్కడ మరో ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ముఠా తమ మోసాలను కొనసాగించింది.

ఈ కేసులో హర్షల్ రావల్, ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్ అనే వ్యక్తుల ముఠాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను పాటియాలలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వేలాది మంది అమెరికా పౌరులను ఈ ముఠా మోసం చేసినట్లు దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు. మోసాల ద్వారా కొల్లగొట్టిన సొమ్మును తరలించేందుకు వందల సంఖ్యలో మ్యూల్ బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు గుర్తించారు.
అమెరికా నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు స్వీకరించి, హవాలా మార్గాల్లో నగదును ఈ ముఠా బదిలీ చేసినట్లు గుర్తించారు. దాదాపు రూ. 400 కోట్ల మేర క్రిప్టో లావాదేవీల ద్వారా మోసాలకు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ సైబర్ మోసాల వెనుక గల ఆర్థిక లావాదేవీలు, ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ అధికార వర్గాలు చెప్పాయి.

కాగా హర్షల్ రాహుల్ ముఠా కార్యకలాపాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంత సైబర్ కేటుగాళ్ల మోసాల సారూప్యతను కలిగి ఉండడం గమనార్హం. దాదాపు రూ. 1,000 కోట్లకుపైగా లావాదేవీలను సత్తుపల్లి, వేంసూరు కేంద్రాలకు చెందిన సైబర్ నేరాల కేటుగాళ్లు నిర్వహించినట్లు ఇప్పటికే నమోదైన కేసుల ద్వారా పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అస్ట్రేలియా, కంబోడియా వంటి విదేశాలకు కాల్ సెంటర్లను నిర్వహిస్తూ, టెలీగ్రామ్ గ్రూపుల ద్వారా విదేశీయులను సత్తుపల్లి ప్రాంత సైబర్ కేటుగాళ్లు దోచుకున్నట్లు తెలంగాణా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉండగా, సత్తుపల్లి ప్రాంత సైబర్ కేటుగాళ్ల ముఠా తరహాలోనే హర్షల్ రావల్ ముఠా విదేశీయులను, ముఖ్యంగా అమెరికా సిటిజన్స్ ను టార్గెట్ గా ఎంచుకుని దోపిడీకి పాల్పడడం గమనార్హం.

