(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, విస్తరిస్తున్న ప్రాంతంగా నాయకులు పదే పదే చెబుతున్న ఖమ్మం జిల్లా ఇప్పుడు సైబర్ నేరాల ‘హబ్’గా మారింది. ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు. తమ దర్యాప్తులో భాగంగా తెలంగాణా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అధికారులు అధికారికంగా చెబుతున్న లెక్కల్లోని కీలకాంశమిది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈనెల 2, 3 తేదీల్లో సీఎస్బీ, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో నిర్వహించిన ‘స్పెషల్ ఆపరేషన్’లో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఆపరేషన్ లో బాదిన మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, సైబర్ మోసాలకు సహకరించేందుకు వీళ్లు మొత్తం 10 మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఇచ్చినట్లు సీఎస్బీ ప్రకటించింది.
మొత్తం 40 మంది పోలీసు అధికారులతో 11 టీంలుగా నిర్వహించిన ప్రత్యేక దాడిలో మ్యూల్ ఖాతాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని ఎనిమిది పోలీస్ స్టేషన్లలో 25 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ చేసిన ప్రకటనలో కీలకాంశాన్ని గమనిస్తే.. నివ్వెరపోక తప్పదు. దేశవ్యాప్తంగానేగాక తెలంగాణాలోని అనేక సైబర్ నేరాల కేసులతో ప్రత్యేక ఆపరేషన్ లో గుర్తించిన ఖాతాలకు సంబంధాలు ఉన్నాయట. తద్వారా విశ్లేషించిన రూ. 7.84 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో రూ. 6.23 కోట్ల మొత్తం వివాదాస్పదమట.

అంతేకాదు తాజా స్పెషల్ ఆపరేషన్ కు ఖమ్మం జిల్లాలోని వీఎం బంజర, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన క్రైం నెం. 234/2025, 86/2026 కేసులు మూలాధారంగా సీఎస్బీ పేర్కొంది. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలను, లాగిన్ వివరాలను సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించి, తరలించడానికి మ్యూల్ ఖాతాలుగా ఉపయోగించేందుకు ఇచ్చినట్లు గుర్తించారు. డబ్బు తరలింపునకు అనేక లావాదేవీలు జరిపారు. విదేశాల్లోని చైనా ఆపరేటర్లతో సమన్వయంతో నడిచే టెలీగ్రామ్ గ్రూపుల ద్వారా అనధికార ఆన్ లైన్ గేమింగ్ చెల్లింపులు, రాబడుతలను నిర్వహించేందుకు ఈ ఖాతాలను ఉపయోగించారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో నమోదు చేసిన ఆయా రెండు కేసులను మరింత లోతైన దర్యాప్తులకోసం తెలంగాణా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)కు అప్పగించారు. దీంతో సీఎస్బీ ప్రధాన కార్యాలయంలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో క్రైం నెం. 49/2026, 50/2026లుగా తిరిగి నమోదు చేశారు. క్రైం నెం. 49/2026లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయా నిందితులను ఖమ్మంతోగల సంబంధాలు, అనేక ఆర్థిక సంబంధాలు ఎస్టాబ్లిష్ అయినట్లు సీఎస్బీ గుర్తించింది. ఈ పరిణామం ఖమ్మంలో సైబర్ మోసాలకు, సంబంధిత ఆర్థిక లావాదేవీలకు సహకరించే ఒక వ్యవస్థీకృత స్థానిక నెట్ వర్క్ ఉండే అవకాశాన్ని సూచిస్తోందని సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో సైబర్ నేరాలను నివారించాలని, ఇటువంటి క్రైంకు ఖమ్మం కేంద్రంగా మారకుండా చూడాలనే లక్ష్యంతోనే ఈ స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. గత ఫిబ్రవరిలోనూ టీజీసీఎస్బీ ‘ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0’ నిర్వహించి ఖమ్మం యూనిట్ లోని ఆరు బ్యాంకు శాఖల్లో 75 మ్యూల్ ఖాతాలను గుర్తించింది. వాటి ఆధారంగానే 75 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 25 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో పది మంది వ్యాపారులు, 9 మంది కూలీలు, ఆరుగురు ప్రైవేట్ ఉద్యోగులు, మరో ఆరుగురు నిరుద్యోగులు, నలుగురు ప్రయివేట్ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం.
మొత్తంగా ఈనెల 2, 3 తేదీల్లో సీఎస్బీ అధికారులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ ను లోతుగా గమనిస్తే అవగతమవుతున్న అసలు విషయం ఏమిటో తెలుసా? ఖమ్మం జిల్లాలోని వీఎం బంజర, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన క్రైం నెం. 234/2025, 86/2026, వాటి ద్వారా హైదరాబాద్ సీఎస్బీ ప్రధాన కార్యాలయంలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో క్రైం నెం. 49/2026, 50/2026 కేసుల్లో ప్రధాన నిందితులు ఎవరో గుర్తున్నారు కదా..? ఔను.. ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్ వంటి వ్యక్తులు ఆయా కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా మరో రూ. 100 కోట్ల సైబర్ నేరాల కేసులో దేవరపల్లి పట్టాభి అనే ముఖ్య నిందితుడు కూడా పోలీసుల తదుపరి దర్యాప్తులో ఉన్నాడు.

అంటే.. ఖమ్మం జిల్లాలో ఏర్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు భావిస్తున్న ‘వ్యవస్థీకృత స్థానిక నెట్ వర్క్’ను ఛేదించే ప్రక్రియలో భాగంగా ఈనెల 2, 3 తేదీల్లో ‘స్పెషల్ ఆపరేషన్’ నిర్వహించారన్నమాట. రాజకీయ అండతో పేట్రేగుతూ, సైబర్ నేరాల ద్వారా వందలాది కోట్ల మొత్తాన్ని పోగేసుకున్నట్లు నమోదైన కేసుల్లోని కీలక నిందితులకు సీఎస్బీ అధికారులు ‘ఉచ్చు’ బిగిస్తున్నారనేది ఈ సందర్భంగా సుస్పష్టం. అధికార, విపక్ష పార్టీలనే తారతమ్యం లేకుండా సాగుతున్న కేసుల దర్యాప్తులో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు ముఖ్య నేతల బంధువులకు, అనుయాయులకు మున్ముందు గడ్డుకాలంగానే భావింవచ్చు.

స్పెషల్ ఆపరేషన్లలో ఫీల్ట్ టీం జరిపిన విశ్లేషణ, పరిశీలనాంశాలను తదుపరి దర్యాప్తు చర్యల కోసం ఉపయోగిస్తున్నట్లు సీఎస్బీ అధికారులు ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని గుర్తించడానికి, ఖాతాలను నిర్వహించినవారిని, వారికి సహకరించినవారిని కనుగొనేందుకు సీఎస్బీ స్పెషల్ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. మొత్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా దోచుకున్నట్లు నమోదైన సైబర్ ఛీటింగ్ కేసుల్లో ‘రాజకీయం’తో అంటకాగుతున్న అసలు సూత్రదారులకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఉచ్చు గట్టిగానే బిగిస్తున్నారన్నమాట. అదీ తాజాగా ఖమ్మం జిల్లాలో సీఎస్బీ నిర్వహించిన ‘స్పెషల్ ఆపరేషన్’లోని అసలు సారాంశం.

