Top 5 This Week

Related Posts

CSB భారీ ఆపరేషన్: 101 మంది అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) దక్షిణ భారతదేశ వ్యాప్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో 18 మంది మహిళలతో సహా 101 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనలో దాదాపు రూ. 17 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించారు. ఈనెల గత నెల 23వ తేదీన ప్రారంభమైన ఈ రెండు వారాల ఆపరేషన్ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిల్లో కొనసాగింది. వివిధ రకాల సైబర్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు, ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారు.

టీజీసీఎస్బీ నేతృత్వంలో ఇది ఏకకాలంలో నిర్వహించిన రెండో బహుళ రాష్ట్ర ఆపరేషన్ కావడం గమనార్హం. రాష్ట్ర సరిహద్దులు దాటి, పలు అధికార పరిధులను దుర్వినియోగం చేస్తూ పనిచేస్తున్న సైబర్ నేర ముఠాలను గుర్తించడం, వాటి జాడ కనిపెట్టడం, పట్టుకోవడంలో బ్యూరో నిరంతర కృషికి ఇది నిదర్శనంగా సీఎస్బీ అధికారులు ప్రకటించారు.

  • ఆపరేషన్ ముఖ్యాంశాలు:
  • సమన్వయంతో క్షేత్రస్థాయి చర్యల కోసం 100 మందికి పైగా టీజీసీఎస్బీ సిబ్బందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను మోహరించారు.
  • 18 మంది మహిళలతో సహా 101 మంది నిందితుల అరెస్ట్.
  • రాష్ట్రాల వారీగా అరెస్టులు: కేరళ – 35, ఆంధ్రప్రదేశ్- 22, కర్ణాటక -17, తమిళనాడు -14, తెలంగాణ – 12, పుదుచ్చేరి – 1
  • అరెస్టయిన వారిలో 19 మంది ఏజెంట్లుగా, 81 మంది మ్యూల్ ఖాతాదారులుగా గుర్తించారు.
  • ఈ ఆపరేషన్లో వివిధ మోసపూరిత లావాదేవీలకు ఉపయోగించినట్లు ఆరోపణలున్న పలు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు.
  • మ్యూల్ ఖాతాల ద్వారా జరిగిన సుమారు రూ. 17 కోట్ల మోసపూరిత లావాదేవీలను గుర్తించారు.
  • నిందితుల వివరాలు
  • నిందితులు వివిధ వయస్సుల వారు, వివిధ వృత్తులు, విద్యా నేపథ్యాలకు చెందినవారని దర్యాప్తులో తేలింది.
  • నిందితుల్లో అధిక శాతం, అంటే 82% మంది, 20-50 ఏళ్ల వయస్సు వారు కాగా, 17% మంది 50 ఏళ్లు పైబడినవారు.
  • వృత్తుల వారీగా చూస్తే, వ్యాపారం/స్వయం ఉపాధి పొందుతున్నవారు అత్యధికంగా 23% ఉండగా, ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు (13%), గృహిణులు (10%), డ్రైవర్లు/ఆపరేటర్లు (7%), సేల్స్/మార్కెటింగ్ రంగంలోనివారు (5%) ఉన్నారు.
  • విద్యార్హతల పరంగా, 26% మంది ఇంటర్మీడియట్, 24% మంది డిగ్రీ/గ్రాడ్యుయేట్లు, 16% మంది సెకండరీ విద్య చదివినవారు, 11% మంది నిరక్షరాస్యులు, 7% మంది డిప్లొమా/ఐటీఐ, 4% మంది ప్రాథమిక విద్య చదివినవారు కాగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, బీ.టెక్, నర్సింగ్ వంటి వృత్తిపరమైన/ఇతర అర్హతలున్నవారు చెరో 3% ఉన్నారు.
  • ముఖ్యమైన కేసులు, నేర సంబంధాలు
  • దేశవ్యాప్తంగా విస్తృత సైబర్ నేర సంబంధాలున్న పలువురు నిందితులను ఈ ఆపరేషన్ లో గుర్తించారు… వీరిలో…
  • కమీషన్ కోసం సైబర్ మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చుతూ ఏజెంట్గా వ్యవహరించినట్లు ఆరోపణలున్న టాటా క్యాపిటల్ ఉద్యోగి.
  • కమీషన్ ప్రాతిపదికన మ్యూల్ ఖాతాలు సమకూర్చినట్లు ఆరోపణలున్న, మనీ ఎక్చేంజ్ వ్యాపారం చేస్తును ఒక్కగ్రాడ్యుయేట్.
  • సైబర్ నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న, దేశవ్యాప్తంగా ఆరు సైబర్ నేర కేసులతో సంబంధమున్న ఒక మాజీ సైనికుడు.
  • దేశవ్యాప్తంగా 26 సైబర్ నేర కేసులతో సంబంధమున్న, ఫిల్మ్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన ఒక నిందితుడు.
  • దేశవ్యాప్తంగా 34 సైబర్ నేర సంబంధాలున్న, ఎం.కామ్ చదివిన ఒక వ్యాపారి.
  • కమీషన్ కోసం తన బ్యాంక్ ఖాతాను సైబర్ నేర సంబంధిత మోసపూరిత లావాదేవీలకు వినియోగించినట్లు ఆరోపణలున్న, దేశవ్యాప్తంగా 50 సైబర్ నేర కేసులతో సంబంధమున్న ఫ్లిప్కార్ట్ ఉద్యోగి, గ్రాడ్యుయేట్.
  • దేశవ్యాప్తంగా 15 సైబర్ నేర కేసులతో సంబంధమున్న, మంజు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్న ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్.
  • సైబర్ నేర నిధుల స్వీకరణ, బదిలీకి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్న, దేశవ్యాప్తంగా 60 సైబర్ నేర కేసులతో సంబంధమున్న, స్వచ్చంద సంస్థల (ఎన్జీఓ) పేరిట తెరిచిన ట్రస్ట్ ఖాతాలు.
  • సమన్వయంతో అరెస్టులు:
  • రాష్ట్ర సరిహద్దులు దాటి సమన్వయంతో జరిపిన దర్యాప్తు, క్షేత్రస్థాయి చర్యల ప్రభావాన్ని ఈ ఆపరేషన్ స్పష్టం చేసింది.
  • సీసీపీఎస్ వరంగల్ క్రైమ్ నంబర్లు 67/2025, 69/2025కు సంబంధించి, ఒక నిందితుడి వాంగ్మూలం ఆధారంగా కర్ణాటక బృందం బెంగళూరులో తుకారాం హెంబాడేను అరెస్ట్ చేసింది. అనంతరం అవే కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బృందం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో కొక్కర్లపాటి సిద్ధు వర్మను అరెస్ట్ చేసింది.
  • మరో కేసులో, సినిమా పైరసీకి సంబంధించిన క్రైమ్ నంబర్ 52/2026లో సీసీపీఎస్ హెడ్ క్వార్టర్స్ బృందం పుదుచ్చేరిలో సి. విజయ్ కుమార్ను అరెస్ట్ చేసింది.
  • దర్యాప్తులో వెల్లడైన అంశాలు:
  • సైబర్ మోసగాళ్లు ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సేకరించి, ఏటీఎం విత్ డ్రాలు, బల్క్ బదిలీలు, విదేశాలతో సంబంధమున్న లావాదేవీలు వంటి వివిధ మార్గాల్లో మోసపూరిత నిధులను స్వీకరించడానికి, బదిలీ చేయడానికి, విత్య్ర చేయడానికి వాటిని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఆయా ఖాతాల ద్వారా జరిగిన మోసపూరిత మొత్తంలో 5% వరకు కమీషన్ ను ఖాతాదారులకు, మధ్యవర్తులకు చెల్లించారు.
  • ఈ ఆపరేషన్లో జరిగిన అరెస్టులు టీజీసీఎస్బీకి చెందిన ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో (సీసీపీఎస్) నమోదైన 51 కేసులకు సంబంధించినవి.
  • ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,172 నేర సంబంధాలను గుర్తించగా, వాటిలో 206 తెలంగాణకు సంబంధించినవి. మొత్తం మోసపూరిత మొత్తం సుమారు రూ. 17 కోట్లు. అరెస్టయిన 101 మంది నిందితుల్లో 50 మందికి దేశవ్యాప్తంగా ఐదుకు పైగా నేర సంబంధాలున్నాయి.
  • కొనసాగుతున్న దర్యాప్తు:
  • ఈ భారీ సైబర్ నేర కార్యకలాపంలో మరిన్ని నేర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు, అంతర్జాతీయ ముఠాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
  • ఆపరేషన్ ప్రణాళిక, పర్యవేక్షణ, అమలులో అంకితభావం, సమన్వయం, కచ్చితత్వం ప్రదర్శించినందుకు టీజీసీఎస్బీ హెడ్ క్వార్టర్ కు చెందిన బి. సాయి శ్రీ, ఐపీఎస్, బిక్షం రెడ్డి, అడిషనల్ ఎస్పీ, కె. వి. సూర్య ప్రకాశ్, డీఎస్పీ, కె. వి. ఎం. ప్రసాద్, డీఎస్పీలతో పాటు, క్షేత్రస్థాయి ఇన్చార్జ్ అధికారులు ఎం. వెంకట రమణ, ఎస్ హెచ్, సీసీపీఎస్ వరంగల్: సీహెచ్. ఆర్. వి. ఫణీందర్, ఎస్ హెచ్, సీసీపీఎస్ ఖమ్మం, ఎన్. వేణు గోపాల్ రెడ్డి, డీ4సీ సంగారెడ్డి, కె. రమేశ్, ఎస్ హెచ్ఎ, సీసీపీఎస్ కరీంనగర్, పి. రాజు, ఎస్ హెచ్, సీసీపీఎస్ సిద్దిపేట, కె. వెంకటయ్య, డీ4సీ సూర్యాపేట, వారి బృందాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ అభినందించారు.
  • పౌరులకు సూచనలు, విజ్ఞప్తి:
  • కొత్తగా పుట్టుకొస్తున్న సైబర్ మోసాల పట్ల, ముఖ్యంగా నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పౌరులకు విజ్ఞప్తి చేసింది.
  • పెట్టుబడి ఉచ్చుల్లో పడకండి. రోజూ అధిక రాబడి ఇస్తామని ఆశ చూపే ఆన్లైన్ స్టాక్, ఫారెక్స్, క్రిప్టో ట్రేడింగ్ యాప్లను, టాస్క్ ఆధారిత ఆదాయ ప్లాట్ ఫారాలను నమ్మకండి.
  • “డిజిటల్ అరెస్ట్” మోసాల పట్ల జాగ్రత్త: పోలీస్, కస్టమ్స్ లేదా కొరియర్ అధికారులు ఎవరూ ఆన్ లైన్ లో డబ్బు గానీ, వీడియో వెరిఫికేషన్ గానీ ఎప్పుడూ అడగరు. ఇలాంటి బెదిరింపులపై వెంటనే ఫిర్యాదు చేయండి.
  • మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, క్యూఆర్ కోడ్లను తెలియని వ్యక్తులతో గానీ, మెసేజింగ్ యాప్ల ద్వారా గానీ పంచుకోకండి.
  • సోషల్ మీడియాలో పంపిన తెలియని బ్యాంక్ ఖాతాలకు లేదా లింకులకు డబ్బు బదిలీ చేయకండి.
  • ట్రేడింగ్ లేదా ఆర్థిక లావాదేవీల కోసం ధృవీకరించిన యాప్ లు, వెబ్ సైట్లను మాత్రమే ఉపయోగించండి.
  • సైబర్ నేరాలపై వెంటనే 1930 హెల్ప్ లైన్ కు లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి.

శిఖా గోయల్, ఐపీఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెూం శాఖ, తెలంగాణ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ

Popular Articles