Top 5 This Week

Related Posts

ఢిల్లీలో కొండా సురేఖ.. తేలనున్న భవితవ్యం!

ఢిల్లీ: తెలంగాణా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకే ఆమె ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవిపై నీలినీడలు కమ్ముకున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో కొండా సురేఖను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కొండా సురేఖ సమావేశం కానున్నారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అపాయింట్మెంట్ ను సురేఖ కోరారు.

కాగా మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు అంతకుముందే ఢిల్లీకి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిల్లీలోనే ఉన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను అధికార నివాసంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ కలుసుకున్నారు. పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

పరకాల సభలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం రేవంత్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవ్ంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం, కూతురి వ్యాఖ్యలతో తనకేం సంబంధమంటూ ఆమె వివరణ ఇవ్వడం.. వంటి పరిణామాలు పలువురి నాయకులను చివరికి ఢిల్లీ బాట పట్టించాయి.

ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మంత్రి వర్గంలో కొనసాగుతారా? రాజీనామా చేయిస్తారా? లేక రాజీనామా చేస్తారా? అనివార్యంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా? వంటి అనేక ప్రశ్నలపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ అధిష్టానమే కొండా సురేఖను ఢిల్లీకి పిలిపించడం, సీఎం రేవంత్ సహా పలువురు ముఖ్యనేతలు హస్తినకు చేరుకోవడం వంటి తాజా పరిణామాలు తెలంగాణా అధికార పార్టీ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. పులువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయంటున్నారు.

Popular Articles