Top 5 This Week

Related Posts

తెలంగాణాలో కలకలం: మంత్రి సన్నిహితునిపై ఛీటింగ్ కేసు!

ఖమ్మం: కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం అంశంలో తెలంగాణా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైస్ మిల్లుల యాజమాన్యాల బాగోతాలను సివిల్ సప్లయిస్ శాఖ వరుసగా వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ పరిణామాల్లోనే ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ముఖ్య అనుచరునిగా విశేష ప్రాచుర్యంలో గల వ్యక్తిపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసిన ఛీటింగ్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదీ కేసు నేపథ్యం:
ప్రభుత్వ సివిల్ సప్లయిస్ విభాగం 2025-26 కాలంలో రైతుల నుంచి సేకరించిన సుమారు 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు కొత్తగూడెం మేదరబస్తీలోని శ్రీజ రైస్ మర్చంట్ (మురళీకృష్ణ రైస్) మిల్లుకు అప్పగించింది. అయితే మిల్లు యజమాని ఆళ్ల మురళి ఈ ధాన్యంలో కేవలం 600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాడనేది ఆరోపణల్లోని ముఖ్యాంశం. దాదాపు రూ. 6.91 కోట్ల విలువైన మిగిలిన 1,751 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం.

సివిల్ సప్లయిస్ మేనేజర్ ఫిర్యాదు:
ఈ అంశంపై పౌరసరఫరాల సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేనేజర్ త్రినాథ్‌బాబు టీం గత అక్టోబర్ 28న ఆయా మిల్లులో తనిఖీలు నిర్వహించి ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు ఆళ్ల మురళిపైనేగాక వ్యాపారంలో ఆయన సహభాగస్వామిగా చెబుతున్నటువంటి అంజనమ్మపై కూడా కేసు నమోదు చేశారు. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే తదితర అభియోగాలపై క్రైం నెం. 202/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 316(2), 316(3), 318(3) r/w 3(5) సెక్షన్లతోపాటు 7ECA (ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి కొత్తగూడెం త్రీ టౌన్ దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరీ ఆళ్ల మురళి?
సాధారణంగానైతే ఈ కేసు అంతగా ప్రాధాన్యతను సంతరించుకునేది కాదు. కానీ కేసులో నిందితునిగా పేర్కొన్నటువంటి ఆళ్ల మురళి తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరునిగా విశేష ప్రాచుర్యం పొందారు. కొత్తగూడెం నియోకజవర్గంలో అధికార పార్టీ కార్యకలాపాలను యావత్తునూ ఆళ్ల మురళే పర్యవేక్షిస్తుంటారనే పేరు ఉంది. ఓ రకంగా అధికార పార్టీ తరపున డీఫాక్టో నియోజకవర్గ ఇంఛార్జిగా పేరు గాంచిన మురళిపై పోలీసులు సాహసించి కేసు నమోదు చేశారనే చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది.

ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకే కేసు నమోదు..?
ఆళ్ల మురళిపై సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ త్రినాథ్ ఫిర్యాదు చేయడం, కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జనంలో తీవ్ర చర్చకు దారి తీసింది. మంత్రి పొంగులేటికి అత్యంత సన్నిహితునిగా పేరుగాంచిన మురళిపై పోలీసులు సాహసించి కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆదేశం ఉందనేది ఆయా చర్చకు సంబంధించిన సారాంశం. విషయం డీజీపీ సీవీ ఆనంద్ స్థాయిలోకి వెళ్లిన పరిణామాల్లో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశం మేరకే పోలీసులు ఈ కేసు నమోదు చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆదివారం నమోదైనట్లు పేర్కొంటున్న ఈ కేసు ఎఫ్ఐఆర్ ను మంగళవారం ఉదయం 11 గంటల వరకు కూడా ఆన్ లైన్ లో పోలీసులు అప్ లోడ్ చేసిన దాఖలాలు కనిపించకపోవడం గమనార్హం.

Popular Articles