Top 5 This Week

Related Posts

‘మానుకోట కాంగ్రెస్’కు ఎంపీ వద్దిరాజు బిగ్ షాక్

హైదరాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీకి బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర భారీ షాక్ ఇచ్చారు. ఈమేరకు వద్దిరాజు స్వగ్రామమైన నియోజకవర్గం పరిధిలోని ఇనుగుర్తి మండల కేంద్రం, పరిసర గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో శనివారం జరిగిన చేరికల కార్యక్రమానికి మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షత వహించగా, ఇనుగుర్తి ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరితో పాటు వచ్చిన సుమారు 500 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

చేరిికల కార్యక్రమంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేదికపై పలువురు బీఆర్ఎస్ నాయకులు

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వమే రాష్ట్రానికి, ప్రజలకు శ్రీరామరక్షగా చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏవగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిపోవడంతో నిరాశ చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబాలు ఆ పార్టీకి మూకుమ్మడిగా గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఇనుగుర్తి మండల కేంద్రం ఎప్పుడో కావలసి ఉండగా, రాజకీయ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదన్నానరు. అయితే తనతో పాటు పార్టీ నాయకులు రవీందర్ రావు, కవిత, సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్ తదితరులు విజ్ఞప్తి చేయడంతో మహానేత కేసీఆర్ తమ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిగా హామీలిచ్చి ప్రజలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చారని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు.

తెలంగాణా భవణ్ లో బీఆర్ఎష్ లో చేరిన ఇనుగుర్తి, పరిసర గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

మేజర్ గ్రామ పంచాయతీ ఇనుగుర్తి మాదిరిగానే మహబూబాబాద్ జిల్లా మొత్తాన్ని గులాబీ కంచుకోటగా మార్చేందుకు బీఆర్ఎస్ నాయకులందరం మరింత సంఘటితమై ముందుకు సాగుతామని ఎంపీ వద్దిరాజు చెప్పారు. కేటీఆర్ పట్ల యువతరం చాలా అభిమానం చూపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంపీ వద్దిరాజు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత మాట్లాడారు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బానోత్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles