ఖమ్మం: బాలికపై లైంగిక దాడి కేసులో ఖమ్మం కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితునిపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో అతన్ని దోషిగా నిర్ధారిస్తూ, అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 10,000 మొత్తాన్ని జురిమానాగా విధిస్తూ ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణ అర్జున్ తీర్పు చెప్పారు.
మధిర పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 87/2025 కేసులో నిందితుడు గడ్డాల అరవింద్ @ చిన్ని (35) మధిర పట్టణం నివాసి. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో ఇతనిపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 65(2), పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 5 r/w 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితునిపై మోపిన నేరాన్ని ప్రాసిక్యూషన్ ద్వారా నిరూపించడంతో ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు జడ్జి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణ అర్జున్ ఆయా విధంగా తీర్పు వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తును ఐపీఎస్ అధికారి రూత్విక్ సాయి నిర్వహించగా, కోర్టులో కేసు విచారణకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి సహకరించారు. భరోసా లీగల్ ఆఫీసర్ ఎం. ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ వై. నాగేశ్వరావు, లైజన్ అధికారులు ఎస్సై శ్రీకాంత్, ఆర్ నాగేశ్వరావు,హోంగార్డ్ అయూబ్,సిబ్బంది సమన్వయంతో కేసు విచారణలో సహకరించారు. ప్రస్తుతం మధిర పట్టణ సీఐ దోమల రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కోర్టు సమన్వయంతో వ్యవహరించారు.

