Top 5 This Week

Related Posts

‘సమీక్ష’ న్యూస్ చేతిలో ఆళ్ల మురళిపై ఎఫ్ఐఆర్ కాపీ

కొత్తగూడెం: కొత్తగూడెంలోని శ్రీజ రైస్ మిల్ మేనేజింగ్ పార్టనర్ ఆళ్ల మురళి, అతని భాగస్వామి దుర్వినియోగానికి, నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు సివిల్ సప్లయిస్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఎస్. త్రినాథ్ బాబు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీజ రైస్ మిల్ మేనేజింగ్ పార్టనర్ ఆళ్ల మురలి అలియాస్ మురళి గోపాలరావుపై, మిల్లు భాగస్వామి ఆళ్ల ఆంజనేయమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ 202/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 316(2), 316(3), 318(3), r/w 3(5), ECAలోని 7 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

సివిల్ సప్లయిస్ విభాగపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేనేజర్ ఎస్. త్రినాథ్ బాబు ఇచ్చిన ఫిర్యాదు అనంతరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ‘సమీక్ష’ న్యూస్ సేకరించింది. ఫిర్యాదులోని సారాంశం ప్రకారం.. మొత్తం రూ. 6.91 కోట్ల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా 1,750 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం మాయమైంది.

సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ త్రినాథ్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని మొదటి పేజీ..

2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి, బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే బాధ్యతను శ్రీజ రైస్ మర్చంట్‌కు అప్పగించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో మిల్లు యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. అయితే ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం విషయంలో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు సివిల్ సప్లయిస్ అధికారులు గుర్తించారు.

తనిఖీల్లో బయటపడిన భారీ లోటు:
జిల్లా కలెక్టర్ (సివిల్ సప్లైస్) ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి, డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లైస్) డి. శంకర్ తదితర అధికారులు అక్టోబర్ 28న ఉదయం 11.30 గంటలకు శ్రీజ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు పంచనామా చేస్తూ సాక్షుల సమక్షంలో రికార్డులు, భౌతిక నిల్వలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1,053.532 మెట్రిక్ టన్నులు, రబీ సీజన్‌కు సంబంధించి 697.200 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల్లో లోటు ఉన్నట్లు గుర్తించారు. రెండు సీజన్లకు కలిపి మొత్తం 1,750.732 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కల్లో వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు పంచనామాలో పేర్కొన్నారు.

సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ త్రినాథ్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని రెండో పేజీ..

ఖరీఫ్‌లో రూ.4.45 కోట్లు.. రబీలో రూ.2.45 కోట్లు:
ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి 1,053.532 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువను రూ.3,56,58,719గా అధికారులు అంచనా వేశారు. దీనిపై 25 శాతం జరిమానా రూ.89,14,680 కలిపి మొత్తం రూ.4,45,73,399 బకాయిగా నిర్ధారించారు.

అదేవిధంగా రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి 697.200 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ. 1,96,65,194గా లెక్కించారు. దీనిపై 25 శాతం జరిమానా రూ. 49,16,298 కలిపి మొత్తం రూ. 2,45,81,493 బకాయిగా పేర్కొన్నారు. రెండు సీజన్లకు కలిపి జరిమానాతో సహా మొత్తం రూ. 6,91,54,891 చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో వెల్లడించారు.

మేనేజింగ్ పార్టనర్‌తో పాటు భాగస్వాములపై ఫిర్యాదు:
శ్రీజ రైస్ మర్చంట్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ అల్లా మురళి గోపాల్ రావుతో పాటు భాగస్వాముల వివరాలను కూడా అధికారులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పొందుపరిచారు. ప్రభుత్వ ధాన్యాన్ని నమ్మకపూర్వకంగా అప్పగించినప్పటికీ, ఒప్పంద నిబంధనల ప్రకారం తిరిగి బియ్యం సరఫరా చేయడంలో విఫలమయ్యారని, ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి గురైనట్లు ఆరోపించారు.

సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ త్రినాథ్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని చివరి పేజీ..

పలు చట్టాల కింద చర్యలకు విజ్ఞప్తి:
ఈ వ్యవహారంలో భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్లు 316(2), 316(5), 318(3), అత్యవసర వస్తువుల చట్టం -1955లోని సెక్షన్ 7, తెలంగాణ రైస్ (కస్టమ్ మిల్లింగ్) ఆర్డర్ 2015లోని సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా మేనేజర్ ఎస్. త్రినాథ్ బాబు కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌ లో ఈనెల 1వ తేదీన ఫిర్యాదు చేశారు.

పంచనామా, కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం, ఓపీఎంఎస్ లావాదేవీల రికార్డులను ఫిర్యాదుతోపాటు జతచేసి పోలీసులకు సమర్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత మిల్లర్‌తో పాటు బాధ్యులైన ఇతర వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా ఈ అంశంలో ఆళ్ల మురళి, అతని భాగస్వాములు నేరపూరిత నమ్మక ద్రోహంతో మోసం చేశారని, ప్రభుత్వ సీఎంఆర్ ధాన్యాన్ని దుర్వినియోగం చేశారని సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ త్రినాథ్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరునిగా, కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి డిఫాక్టో ఇంఛార్జిగా ప్రాచుర్యం పొందిన ఆళ్ల మురళిపై నమోదైన ఈ కేసులో పోలీసుల తదుపరి చర్యలు ఏమేరకు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.

Popular Articles