ఖమ్మం: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు ఆమెను బెదిరింపులకు గురిచేసిన కేసులో ఖమ్మం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈమేరకు నిందితునిపై నేరం రుజువు కావడంతో దోషిగా నిర్ధారిస్తూ అతనికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10.000 మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ ఖమ్మం మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏ. ప్రవీణ్ కుమార్ తీర్పును వెలువరించారు.
కారేపల్లి మండలం మేకలతండాకు చెందిన భూక్యా లచ్చిరాం (42) అనే వ్యక్తి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడమేగాక, ఆమెను బెదిరించాడనే ఫిర్యాదుపై 2019లో పోలీసులు కేసు నమోదు చేశారు. కారేపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 48/2019 ద్వారా ఐపీసీలోని 354, 506 సెక్షన్ల కింద నిందితుడు భూక్యా లచ్చిరాం (42)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ కేసులో వాద, ప్రతివాదనల అనంతరం నిందితునిపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో ఖమ్మం మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏ. ప్రవీణ్ కుమార్ నిందితుడు భూక్యా లచ్చిరాంను దోషిగా నిర్ధారించారు. కేసులో తీర్పును వెలువరిస్తూ లచ్చిరాంకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.
ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి ఏఎస్ఐ బి. కృష్ణ ప్రసాద్, ప్రధాన దర్యాప్తు అధికారి పి. వెంకన్న సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించారు. కోర్టులో కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి నేర నిరూపణకు సహకరించారు. కేసు విచారణలో సహకరించిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ సిహెచ్.నాగేశ్వరరావు, ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ గాయత్రి, బ్రీఫింగ్ ఆఫీసర్ ఎస్సై పి. గోపి, లైజన్ అధికారి ఎస్ఐ కె. శ్రీకాంత్‌లను అడిషనల్ డీసీపీ రామానుజం అభినందించారు.

