కొత్తగూడెం: మురసు తుపాను ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వణికిపోతోంది. తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు జిల్లాలో రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. మరోవైపు పలు చెరువులు నిండుకుండలా మారడంతో అనివార్యంగా కొన్నింటికి గండ్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చెరువుల రింగ్ బండ్లు తెగిపోయాయి. మురసు తుపాన్ ఎఫెక్ట్ తో భద్రాద్రి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి.

- అశ్వారావుపేట మండలంలోని పెద్ద వాగు ప్రాజెక్టు రింగ్ బండ్ తెగిపోయింది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రింగుబండ్ సైతం మురసు తుపాన్ ధాటికి గండి పడింది. గత రాత్రి నుంచి గేట్ల ద్వారా నీరు దిగువకు పంపుతున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రింగుబండ్ ఎత్తు 2 మీటర్ల లోపే ఉండటంతో వరద ధాటికి రింగుబండ్ కట్ట పూర్తిగా దెబ్బతిని నీరు దిగువకు ప్రవహిస్తోంది దీంతో దిగువ ప్రాంతవాసులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
- అదేవిధంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాగులు వంకలు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి.
- అశ్వారావుపేట నుంచి భద్రాచలం వైపు వెళ్లే దారిలో చెరువులు వాగులు మొత్తం పొంగడంతో 30 గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దమ్మపేట మండలం నెమలిపేట పూర్తిగా మునిగిపోవడంతో ట్రైనీ కలెక్టర్ మురళీధర్ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల నివాసాలు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
- ఖమ్మం జాతీయ రహదారి 365 బీబీ నారావారిగూడెం వద్ద రోడ్లపై వరద నీరు పొంగడంతో వాహనాలు రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. దమ్మపేట నుంచి పాల్వంచ వైపు రోడ్డు కూడా మూతపడటంతో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించింది.

- భారీ వర్షాలతో అశ్వారావుపేట పట్టణం కూడా జలమయమైంది. వరద నీరు పోటెత్తడంతో దొంతికుంట చెరువుకు అధికారులు గండిపెట్టారు. చెరువు వరద రోడ్డుపైకి చేరడంతో భద్రాచలం రహదారిపై ఓ బైకిస్ట్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ సకాలంలో స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.
- బూర్గంపాడు మండలంలో అకాల వర్షాలతో వరి పంటలు నేలవాలాయి. పత్తి చేలు తడిసి ముద్దయ్యాయి. దీంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇల్లందు డివిజన్లో మురసు తుఫాను ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బ తిన్నాయి. ఈ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, మిరప, వరి పంటలపై వర్షం ప్రభావం పడింది. పత్తి తడిసి నల్లబడే ప్రమాదం ఉండగా, రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిపోయింది. మిరప పంట పూత రాలిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు వరి పంట నేలవాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ములకలపల్లి మండలంలో 230 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేసిన వేరుశెనగ పంట పాములేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటితోపాటు పుచ్చకాయ తోటలు, మొక్కజొన్న పంటలు సైతం భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
- ఆయా పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గురు, శుక్రవారాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. మురసు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలతో నష్టపోయిన పంటలను, ముంపు ప్రాంతాలను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

