హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు, శాంతి భద్రతల పరిరక్షణ, కేసు దర్యాప్తులో పోలీసుల వ్యవహార శైలి, పోలీసుల అవినీతి, మహిళల రక్షణ, పిల్లల అక్రమ రవాణా వంటి అనేక అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఆయా అంశాలపై కొత్త డీజీపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
- నా మీద నమ్మకం పెట్టి రాష్ట్ర డీజీపీగా నియమించినందుకు ధన్యవాదాలు.
- ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో అహర్నిశలు పని చేస్తాం.
- తెలంగాణా పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ గా పేరు తెచ్చుకుంది.
- తెలంగాణా పోలీసులు దేశంలోనే బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు.
- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, నేర దర్యాఫ్తులో పోలీసులు విస్మరించరాదు.
- రాష్ట్ర పోలీసు యంత్రాంగం అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
- శాంతి భద్రతల కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
- కేసుల దర్యాప్తులో టెక్నాలజీని వాడడంలో తెలంగాణా పోలీస్ శాఖ మొదటి స్థానం లో ఉంది.
- ఇప్పుడు గతంలో కంటే నేరాల్లో మార్పులు వచ్చాయి.
- సైబర్ నేరాలు భారీగా పెరిగాయి, వీటిని అదుపు చేయడంలో జిల్లా ఎస్పీల పాత్ర కీలకంగా ఉండాలి.
- డ్రగ్స్ అనేది ఇప్పడు సమాజంలో విస్తరించింది, ఈగల్ , నార్కోటిక్ విభాగాల ద్వారా డ్రగ్స్ ను అరికడతాం. డ్రగ్స్ నిర్మూలన మా మొదటి ప్రాధాన్యత.
- ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ మేజెజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.
- మహిళల రక్షణ, పిల్లల అక్రమ రవాణా అతిపెద్ద సమస్యగా మారింది. ఇది వ్యవస్థీకృత నేరంగా మారింది, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం.
- ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలపై కూడా పోలీస్ శాఖ మరింత దృష్టి పెడుతుంది.
- తెలంగాణా పోలీస్ శాఖను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది, అది కూడా త్వరలో చేస్తాం.
- నక్షలైట్లు నిర్ములన కోసం ఏర్పాటైన గ్రేహౌండ్స్, ఎస్ఐబీని సరైన రీతిలో పోలీస్ శాఖ వినియోగించుకోవాల్సిన అవసరముంది.
- పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.
- పోలీస్ రిక్రూట్మెంట్ , ట్రైనింగ్ లో కూడా మార్పులు తీసుకొస్తాం.
- ప్రయివేటు సెక్టార్ లో ఏవిధంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారో, ఆలాగే పోలీస్ శాఖలోనూ తీసుకువస్తాం.
- పోలీస్ అధికారులు ఈ మధ్య నేరాల దర్యాప్తు లో సీసీ కెమెరాలపై మాత్రమే ఆధారపడుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లేక పోతే నిస్సహాయంగా మారిపోతున్నారు. అలా కాకుండా నేర ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో కేసును ఎలా ఛేదించాలనే పాత కాలం పద్ధతిని తీసుకొస్తాం.
- గోవధపై పోలీసులే చర్యలు తీసుకుంటారు, ప్రయివేటు వ్యక్తులు రోడ్లపైకి రావద్దని తెలియజేస్తున్నాం.
- అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- ఫోన్ టాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది, ఈ కేసును ప్రస్తుతం సిట్ విచారణ చేస్తోంది. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో ఆ కేసు గురించి నాకు తెలుసు. త్వరలో ఆ కేసును సమీక్షించి తుది చార్ట్ షీట్ ను కోర్టులో దాఖలు చేస్తాం.
- ఇంకా అజ్ఞాతంలో గల తెలంగాణాకు చెందిన ఐదుగురు మావోయిస్టులు దయచేసి లొంగిపోవాలి. వారికి పునరవాసం కల్పిస్తాం.

