హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న కీలక నేత హేమ్లా ఐతు అలియాస్ విజ్జా సహా 47 మంది నక్సల్స్ తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ 32 తుపాకులను కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి అప్పగించారు. జనజీవన స్రవంతిలో తాజాగా కలిసిన ఆయా మొత్తపు సంఖ్య నక్సల్స్ దక్షిణ బస్తర్ డివిజన్ లో కార్యకలాపాలు నిర్వహించినవారేగాక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికే చెందినవారు కావడం గమనార్హం.
ఈ లొంగుబాటు వల్ల దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నిర్వీర్యమైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఆయా మొత్తం నక్సలైట్లపై రూ. 1.50 కోట్ల నగదు రివార్డు ఉందని, ఆయా మొత్తాన్ని వారికే పంపిణీ చేస్తామని చెప్పారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. స్వస్థలాలతో సంబంధం లేకుండా తెలంగాణాలో లొంగిపోతున్న నక్సలైట్ల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణాలో 260 మంది మావోయిస్టుల లొంగిపోయారని తెలిపారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, పది మంది రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. లొంగుబాటు ప్రక్రియలో మొత్తం 238 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తెలంగాణాకు చెందిన మరో నలుగురు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, అయితే వారంతా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ నలుగురిలో ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, జాడె రత్నబాయి, వార్తా శేఖర్ ఉన్నారని, వీళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు.

