Top 5 This Week

Related Posts

‘రెడ్డి’గా పేరు మార్చుకున్న కన్ఫర్డ్ ఐఏఎస్

ఔను.. కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి వాసం వెంకటేశ్వర్లుగా ‘రెడ్డి’గా మారారు. ఖమ్మం ఆర్డీవోగా, భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టరుగా పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు ‘వాసం వెంకటేశ్వర్ రెడ్డి’గా తన పేరును అధికారికంగానే మార్చుకున్నారు. వాసం వెంకటేశ్వర్లు తన పేరును ‘వాసం వెంకటేశ్వర్ రెడ్డిగా మార్చుకున్నారనే విషయాన్ని పేర్కొంటూ గత జనవరి 2వ తేదీన ‘తెలంగాణా రాజపత్రం’ కూడా విడుదలైంది. అయితే ఈ విషయం బాహ్య ప్రపంచంలో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు.

మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు తన పేరును మార్చుకున్నారనే అంశంపై ఆయన సన్నిహితులకు కూడా సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే నిన్న బదిలీకి గురైన ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులో వాసం వెంకటేశ్వర్లు పేరు ‘వెంకటేశ్వర్ రెడ్డి’గా మారిందనే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘సమీక్ష’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని చదివిన పలువురు ‘సమీక్ష’ న్యూస్ కు ఫోన్లు కూడా చేసి వెంకటేశ్వర్లు పేరు మార్చుకున్నారనే అంశంపై సందేహాన్ని వ్యక్తం చేశారు. దీంతో జర్నలిస్టిక్ ఎథిక్స్ లో భాగంగా సమాచారం కోసం గూగుల్ లో వెతికినపుడు వాసం వెంకటేశ్వర్లు పేరు మార్చుకున్నట్లు ‘తెలంగాణా రాజపత్రం’ కనిపించింది. దీంతో వాసం వెంకటేశ్వర్లు తన పేరు మార్చుకున్నట్లు ధ్రువపడింది.

అయితే కీలక వ్యక్తులు తమ పేర్లను మార్చుకున్నపుడు విషయాన్ని బాహాటంగా ప్రకటిస్తుంటారు. ఇటీవల ఏపీలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సందర్భాన్ని వివరిస్తూ బాహాటపు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వాసం వెంకటేశ్వర్లు వంటి ఐఏఎస్ అధికారి ఈ విషయంలో సాంకేతికంగా ప్రక్రియ ప్రకారమే వ్యవహరించి ఉండవచ్చు.. కానీ పేరు మార్చుకున్న విషయాన్ని ఆయన బాహాటంగా వెల్లడిస్తే అందరికీ తెలిసేదనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

Popular Articles