Top 5 This Week

Related Posts

సర్కారు ఉత్తర్వులో మరీ ఇంత నిర్లక్ష్యమా..!?

అదేమీ సాదా సీదా ఆదేశపు ప్రతి కాదు.. అక్షరాలా ప్రభుత్వ ఉత్తర్వు.. అధికార ఆదేశపు సంతకంతో కూడిన ప్రతి. అందులోనూ ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులకు సంబంధించిన ఉత్తర్వు అంటే వాటిని రూపొందించే అధికారులు, సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉండాలి? కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఇటువంటి ఉత్తర్వుల జారీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు నిన్నటి ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వు కాపీ బలాన్ని చేకూరుస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే..?

తెలంగాణా ప్రభుత్వం నిన్న 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీకి గురైనవారిలో నవీన్ మిత్తల్ వంటి సీనియర్లతోపాటు వివిధ జిల్లాల్లో కలెక్టర్లుగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. స్థానభ్రంశం చెందిన అధికారుల్లో ప్రస్తుతం యూత్ సర్వీసెస్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. ఆయనను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఐఏఎస్ అధికారి పేరును ‘వాసం వెంకటేశ్వర్ రెడ్డి’గా ఉత్తర్వు(సీరియల్ నెం. 16) లో పేర్కొన్నారు. అయితే తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారుల్లో ఈ వెంకటేశ్వర్ రెడ్డి ఎవరబ్బా..? అని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తలలు నిమురుకున్నాయి.

ఇంతకీ ఈ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఎవరనుకుంటున్నారా? నిజానికి ఆయన ‘రెడ్డి’గారు కాదు. ఆయన పేరు వాసం వెంకటేశ్వర్లు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో భూపాలపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ఈ వాసం వెంకటేశ్వర్లునే ప్రభుత్వ ఉత్తర్వులో ‘వెంకటేశ్వర్ రెడ్డి’గా పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంతకంతో వెలువడే ఇటువంటి కీలక ఉత్తర్వుల్లోనే ఇలా తప్పులు దొర్లితే ఎలా..? అనే ప్రశ్నపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటువంటి కీలక ఉత్తర్వులు రూపొందించేటపుడు కాస్త తప్పులు లేకుండా చూసుకోవాలి కదా సారూ..? అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.

Update:

Popular Articles