హైదరాబాద్: తహశీల్దార్ దేసాని శ్రీనివాసరెడ్డి అక్రమాస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీసులో డివిజనల్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏవో)గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిపై నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో ఏసీబీ గురువారం తనిఖీలు నిర్వహించింది. శ్రీనివాసరెడ్డి నివాసంలోనేగాక అతనికి చెందిన బంధువులు, అనుబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి కూడబెట్టిన ఆస్తులను ఏసీబీ వెల్లడించింది. మొత్తం 6.87 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. ఇవీ ఆ వివరాలు:

- కర్మన్ ఘాట్ ప్రాంతంలో రూ. 2.63 కోట్ల విలువైన రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు.
- కర్మన్ ఘాట్ ఏరియాలోనే రూ. 1.61 కోట్ల విలువైన జీ+3 పెంట్ హౌజ్ భవనం.
- యాచారం మండలం నల్లవెల్లిలో రూ. 25.50 లక్షల విలువైన 10.8 ఎకరాల వ్యవసాయ భూమి.
- హైదరాబాద్ నగరంలోనేగాక, శివారు ప్రాంతాల్లో రూ. 62.84 లక్షల విలువైన ఎనిమిది ఓపెన్ ప్లాట్లు.
- బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంటులో రూ. 86.00 లక్షల పెట్టబడుల్లో భాగస్వామ్యం.

ఇవిగాక నాలుగు లక్షల నగదు, రూ. 8.60 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 5.85 లక్సల విలువైన 680 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 59.00 లక్షల విలువైన వాహనాలు, రూ. 11.00 లక్షల విలవుైన గృహోపకరణ వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 46 తులాల బంగారం రుణాలను కూడా శ్రీనివాసరెడ్డి తీసుకున్నారని, అతని మిగతా ఆస్తులను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఏసీబీ వివరించింది. బహిరంగ మార్కెట్ లో డీఏవో ఆస్తుల విలువ భారీగానే ఉండవచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

