Top 5 This Week

Related Posts

HMDA చీఫ్ ఇంజనీర్ ఆస్తులు ఇప్పటికే రూ. 50.00 కోట్లు!

హైదరాబాద్: హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలపై నమోదైన కేసులో రవీందర్ ఇంట్లోనేగాక, అతనికి సంబంధించిన బంధువుల, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రవీందర్ కు చెందిన 50 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఆలీఖాన్ వెల్లడించారు.

హైదరాబాద్, నిజామాబాద్ నగరాల్లోనేగాక మరో 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. సుముదుర ఆక్రోపోలిస్ లో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, శ్రీవారి మెడోస్ లో ఓ ఫ్లాట్, వాసవి అట్లాంటిస్ లో మూడు ఫ్లాట్లు, శంషాబాద్, షాబాద్ ప్రాంతాల్లో 4 ఎకరాల భూమి, మసీదు బండలో 300 గజాలలో నాలుగు అంతస్థుల భవనం, జడ్చర్లలో 7 ఫ్లాట్స్, కొండాపూర్ లో రెండు ఫ్లాట్స్, అర కిలో బంగారు, కిలోకు పైగా వెండి ఆభరణాలు గుర్తించినట్లు చెప్పారు.

అవేగాక పది లక్షల రూపాయలు విలువైన ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్, నాలుగు బ్యాంక్ లాకర్లు గుర్తించామన్నారు. ఇంట్లో నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని, వీటితో పాటు 18 విదేశీ మద్యం బాటిళ్లను కూడా పట్టుకున్నట్లు చెప్పారు. రవీందర్ కు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, అతనికి చెందిన ఆస్తులు ఇంకా పెరిగే అవకాశమున్నట్లు ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఆలీఖాన్ చెప్పారు.

Popular Articles