హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ అక్రమాస్తుల వివరాలను తెలంగాణా ఏసీబీ మంగళవారం సాయంత్రం వెల్లడించింది. ఈ ఉదయం నుంచీ రవీందర్ నివాసంలోనేగాక, అతని బంధువులు, సంబంధీకులు, బినామీదార్లకు చెందిన తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. తనిఖీల అనంతరం రవీందర్ కు చెందిన అక్రమాస్తుల వివరాలను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లోని ఆమా అక్రమాస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఇవీ ఆ వివరాలు:
- హైదరాబాద్ నగర పరిధిలోని కొండకల్, కిష్టాపూర్, పసమల ప్రాంతాల్లో రూ. 38.89 లక్షల విలువైన ఐదు ఓపెన్ ప్లాట్లు.
- నార్సింగ్, నానక్ రాం గూడల్లో రూ. 2.07 కోట్ల విలువైన నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్లు.
- కొత్తూరు, శంషాబాద్ ప్రాంతంలో రూ. 6.00 లక్షల విలువైన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి.
- మోకిలాలోని శ్రీవారి మెడోస్ లో రూ. రూ. 1.33 కోట్ల విలువైన 300 చదరపు గజాల అసంపూర్తి విల్లా.
- కొండాపూర్ లోని మజీద్ బండలో రూ. 3.00 కోట్ల విలువైన 300 చదరపు గజాల జీ+4 భవనం.
- స్వాధీనం చేసుకున్న ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో భారీగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది.
- అదేవిధంగా రూ. 3.82 లక్షల నగదు, రూ. 45.05 లక్షల బ్యాంకు బ్యాలెన్సులను, రూ. 36.70 లక్షల విలువైన 1,440 గ్రాముల బంగారు ఆభరణాలను, రూ. 10.00 లక్షల విలువైన 12.5 కిలోల వెండి వస్తువులను, రూ. 17.24 లక్షల విలువైన గృహ వినియోగ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
- ఇవిగాక రూ. 9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను, రూ. 1.16 కోట్ల విలువైన ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాలను కూడా స్వాధీన చేసుకున్నారు.
- డాక్యుమెంట్ల విలువ ప్రకారం రవీందర్ కు చెందిన మొత్తం రూ. 9.24 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లను, ఆభరణాలను, నగదును వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వివరించింది.
- చీఫ్ ఇంజనీర్ రవీందర్ ను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అవినీతి నిరోధక శాఖ పేర్కొంది.

