Top 5 This Week

Related Posts

గౌస్ పాషా బాధిత బాలిక మళ్లీ ఐసీయూలోకి..!

హైదరాబాద్: ఖమ్మం నగరంలో గౌస్ పాషా అఘాయిత్యానికి బాధితురాలిగా మారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పన్నెండేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారింది. బాధిత బాలికను మళ్లీ ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆమె తండ్రి ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు. గడచిన రెండు నెలలకుపైగా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్న బాలికను మరోసారి ఐసీయూలోకి తరలించి చికిత్స అందిస్తున్న ఆరోగ్యస్థితిపై ఆమె కుటుంబీకులు కలవరపడుతున్నారు.

గత జూన్ 6వ తేదీన ఖమ్మంలోని రాపర్తినగర్-2 ప్రాంతానికి చెందిన పన్నెండేళ్ల బాలికపై గౌస్ పాషా అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత ఆమెను ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి స్థానికంగా చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రభుత్వం చొరవ తీసుకుని బాలికను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే ఇటీవల నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలికకు మరో ప్రయివేట్ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయిస్తుండగా, ఆరోగ్య పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారిందని ఆమె తండ్రి శనివారం సాయంత్రం ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు. ప్రస్తుతం బాలికను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులు నిందితుడు గౌస్ పాషాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అత్యంత అమానుష ఘటనకు పాల్పడిన గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలని కూడా ఖమ్మంలో పలు రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు కూడా ఆందోళనలు నిర్వహించారు. గౌస్ పాషా ప్రస్తుతం రిమాండ్ లోనే ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Popular Articles