ఖమ్మం: కేజ్ వీల్స్ ట్రాక్టర్ల యజమానులకు ఖమ్మం జిల్లా పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఈమేరకు నలుగురు ట్రాక్టర్ యజమానులపై, వాటి డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. రోడ్లకు నష్టం కలిగించారనే ఫిర్యాదుపై ఈ కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామ శివారులో కాకర్లపల్లి నుండి రుద్రాక్షపల్లి మధ్య గల R&B రోడ్డులో రోడ్లపై కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లు నడుపుతున్నారని, వాటితోనే రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆర్ అండ్ బీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్లపై, వాటి యజమానులైన సారా కృష్ణ, పమ్మి కృష్ణయ్య, గుత్తి ముత్యాలరావు, బోసి కొర్రాజులు పై సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీపీ చెప్పారు.

రోడ్లపై కేజ్ వీల్స్ (Cage Wheels) అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ సందర్బంగా తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి గ్రామాల వరకు మెరుగైన రహదారులను నిర్మిస్తోందని, కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచడం, రోడ్డు దెబ్బతినకుండా చూసుకోవడం అందరి బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చడం సాధారణమే అయినప్పటికీ, పొలాల వద్ద పనులు ముగిసిన తర్వాత కేజ్ వీల్స్ తొలగించి సాధారణ టైర్లు వేసుకోవాలన్నారు. లేదంటే రోడ్లకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు వాడాలని ట్రాక్టర్ల డ్రైవర్లకు, వాటి యజమానులకు సూచించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, రైతులు, ట్రాక్టర్ యజమానులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ఎవరైనాని బంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించినా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్ 100కుగాని, సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధం ట్రాక్టర్ డ్రైవర్లకు, యజమానులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలాని స్థానిక పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు.

