Top 5 This Week

Related Posts

వైన్స్, రియల్ వ్యాపారి కొండపల్లి గణేష్ అరెస్ట్

హైదరాబాద్: లిక్కర్, రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారి కొండపల్లి గణేష్ ను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన గణేష్ గచ్చిబౌలిలోని మైహోం భుజాలో నివసిస్తూ గడచిన రెండేళ్లుగా రూ. 29.00, రూ. 51.00 లక్షల చొప్పున వేలం పాటలో వినాయకుని లడ్డూ దక్కించుకుని వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. తద్వారా ఆర్థిక స్థితిమంతునిగా భ్రమింపజేసిన గణేష్ తమను మోసగించినట్లు మైహోం భుజాలోనే నివసించే అతని బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో గణేష్ పై సైబరాబాద్ EOW పోలీసులు ఈనెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. తాను నిర్వహించే వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో మైహోం భుజాలో నివసించే పలువురిని రూ. 3.45 కోట్ల మొత్తానికి మోసం చేసినట్లు అందిన ఫిర్యాదుపై సైబరాబాద్ EOW పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం అనంతరం పలు యూ ట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ అధికారులపైనా గణేష్ ఆరోపణలు చేశాడు. ఇల్లెందు ఎమ్మెల్యే అనుచరునిపైనా ఆరోపణలు గుప్పించాడు.

ఈమేరకు పలు విభాగాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న డీటీపీ చేసిన ప్రతులను గణేష్ సోషల్ మీడియాలో పలువురికి పంపాడు. ఈ నేపథ్యంలోనే తనపై గణేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా కొండపల్లి గణేష్ గత ఏప్రిల్ నెలాఖరులోనే ఖమ్మం కోర్టులో రూ. 33.00 కోట్లకు పైగా ఐపీ దాఖలు చేయడం గమనార్హం.

Popular Articles