హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతంపై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వర్ రావు సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ చేశారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ అంశంపై నాగేశ్వర్ రావు స్పందించారు. మహిళా ఐపీఎస్, మరో ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిలు పరస్పరం చేసుకున్న ఆరోపణలు ప్రజల్లో చర్చను రేకెత్తించాయన్నారు. ఈ ఇద్దరి అంశంలో పరస్పర విరుద్ధమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం, నిష్పక్షపాతానికి ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి ఆధునిక భారతదేశంలో సామాజిక ఉన్నతికి సంబంధించిన అత్యంత స్ఫూర్తిదాయకమైన గాథలలో ఒకదానికి ప్రతీకగా నిలిచారని నాగేశ్వర్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతంలో తీవ్ర పేదరికంలో జన్మించిన ఆయన, చిన్నతనంలోనే తల్లిని, కౌమార దశలో తండ్రిని కోల్పోయారని చెప్పారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య తన అమ్మమ్మ పెంపకంలో పెరిగిన అతను (ఆమె రోజువారీ కూలీ లేదా చిన్న కూరగాయల వ్యాపారి అని చెబుతారు) ఎలాంటి ప్రత్యేక హక్కులు, ఆర్థిక భద్రత, లేదా ఉన్నత స్థాయి మార్గదర్శకత్వం లేకుండా తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాడని చెప్పారు.
అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, ఉదయ్ కృష్ణారెడ్డి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో స్థానం సంపాదించాడని, అతని విజయం వారసత్వంగా వచ్చిన ప్రత్యేక హక్కుల ఫలితం కాదన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అసాధారణమైన దృఢత్వానికి నిదర్శనంగా అభివర్ణించారు. అయితే ఇటువంటి వాస్తవాన్ని నొక్కి చెప్పడమనేది దుష్ప్రవర్తన రుజువైతే దానిని సమర్థించే ప్రయత్నం కాదని సీబీఐ మాజీ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇదే సందర్బంలో విఫలమైన సంబంధాన్ని నేరంగా పరిగణించాలా? అని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆ ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారుల మధ్య సన్నిహిత, వ్యక్తిగత సంబంధం ఉండేదని, అది ఇప్పుడు విచ్ఛిన్నమైందన్నారు.
ఈ అంశంలో ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయాలన్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం, పరిపాలనాపరమైన నిష్పక్షపాతత్వం, విధానపరమైన స్థిరత్వం, సమానత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని నాగేశ్వర్ రావు అన్నారు. అంతేగాక పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నిర్వచనం ప్రకారం ఏకపక్షంగా ఉండదని, ఒకవేళ పరిపాలనాపరమైన సస్పెన్షన్ అనేది ఉమ్మడి సంబంధాన్ని నియంత్రించే ప్రవర్తనా నియమాలపై ఆధారపడి ఉంటే, ప్రాథమిక సమానత్వం ప్రకారం ఇద్దరు ప్రొబేషనర్లు ఒకే ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్నారు.
ఈ పరస్పర భిన్న ఆరోపణల వివాదంలో మహిళా ఐపీఎస్ పై ఎలాంటి చర్య తీసుకోకుండా ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడం పక్షపాత క్రమశిక్షణ అనే స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందన్నారు. సంస్థలు ఏకపక్ష, అసమాన ఫలితాల ద్వారా కాకుండా, నిష్పాక్షికమైన నిష్పక్షపాతత్వం ద్వారా నైతిక అధికారాన్ని నిలుపుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి అంశంలో నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీకి నాగేశ్వర్ రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకోవాలని కూడా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు తన ‘ఎక్స్’ పోస్టులో కోరారు. ఆయన చేసిన ‘ఎక్స్’ పోస్టులో ఇవి ముఖ్యాంశాలు మాత్రమే. పూర్తి అంశాలను దిగువన గల లింక్ లో చదవవచ్చు.
