ఖమ్మం: గణేష్ నవరాత్రుల నేపథ్యంలో రౌడీషీటర్ల అంశంపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ఆదేశాలను జారీ చేశారు. వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆయన ఖమ్మం జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శనివారం పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, ప్రతి మండపం వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ ప్రాంతాల్లో తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు.
విగ్రహాల ఊరేగింపులో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి పాల్గొనడం వంటి అంశాలపై నిఘా ఉంచాలన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గణేష్ ఉత్సవ కమిటీలు, గణేష్ మండపాల నిర్వాహకులతో వేరువేరుగా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఇదే సందర్భంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు చేపట్టాలని సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. రౌడీషీటర్ల ప్రస్తుత కార్యకలాపాలు, కదలికలు, వారి పరిచయాలు, వివాదాలకు సంబంధించిన అంశాలపై స్థానిక పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని నిర్దేశించారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
పండుగలు, ఉత్సవాలు, ముఖ్యమైన కార్యక్రమాల సందర్భంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రౌడీషీటర్ల కదలికలను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
