హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపేందుకు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు నిలువరించిన సందర్భంగా స్పీకర్ ను ఉద్ధేశించి తాతా మధు చేసిన అసభ్య వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
మొత్తం 41 సెకన్ల నిడివి గల వీడియోలో స్పీకర్ ను ఉద్ధేశించి తాతా మధు చేసిన తీవ్ర అసభ్య వ్యాఖ్యలు రాయలేని విధంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా తాతా మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఏ పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. మరోవైపు స్పీకర్ ను అసభ్య వ్యాఖ్యలతో దూషించిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
