హైదరాబాద్: తనకు భద్రత కల్పించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ ను అభ్యర్థించారు. ఈమేరకు ఆయన డీజీపీని మంగళవారం కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, సోషల్ మీడియాలో, ఆన్ లైన్ లో తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీని కోరారు.
అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని, జనసేన కూడా దీన్ని ఆమోదించినట్లు చెప్పారు. డీజీపీని కలిసి తాను ఎదుర్కుంటున్న ఇబ్బందిని నివేదించానని చెప్పారు. తనకు ఎటువంటి సెక్యూరిటీని కల్పిస్తారనేది తానెలా చెబుతానని, నిర్ణయించేది తాను కాదన్నారు. అవసరమైన మేరకు, సరైన చర్యలు తీసుకోవాలని కోరానని, తనకే జర్నలిజం నేర్పితే ఎలా అని మీడియా అడిగిన ప్రశ్నలపై నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. జనసేనపై తాను చేసిన వ్యాఖ్యలు ముగిసిన అధ్యాయమని పునరుద్ఘాటించారు. ఏపీ పోలీసులనుంచి తనకు ఎటువంటి నోటీసులు ఇప్పటి వరకు రాలేదన్నారు. డీజీపీగారు ఏమన్నారో ఆయననే అడగాలని నాగేశ్వర్ మీడియాకు సూచించారు.

