గన్నవరం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన యూ ట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ (37)పై గన్నవరం పోలీసులు ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే వేర్వేరు కేసుల్లో అరెస్టయిన రావణ్ పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు అతన్ని అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపాన గల వేంపాడు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేయడం గమనార్హం. మరో కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలై హైదరాబాద్ వెడుతున్న రావణ్ ను వేంపాడు టోల్ ప్లాజా వద్ద గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు.
గన్నవరానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు రావణ్ పై క్రైం నెం. 188/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 147, 148, 152, 197 (1)(d) 353(1)(b) సెక్షన్లతోపాటు UAPA 1967 చట్టంలోని 13,39 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జోసఫ్ ను ఈమేరకు నిన్న రాత్రి ఏడు గంటలకు అరెస్ట్ చేసి, ఆ సమాచారాన్ని అతని భార్య బచ్చలకూరి అనూషకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 48 కింద ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.


