Top 5 This Week

Related Posts

తేడా వస్తే వార్త రాసినవాడి తల కూడా నరికేస్తుంది..! ‘ప్రొఫెసర్’ విషయంలో జరిగింది అదే..!!

వార్తలో విశ్వసనీయత అంటే ఏమిటి? విశ్వసనీయమయిన సోర్సెస్ అంటే ఏమిటి? వార్తలో ప్రజా ప్రయోజనాన్ని ఎలా చూడాలి అనే అంశాలను ఉస్మానియాలో నేను ఎంసీజే చదువుకునే రోజుల్లో మా ప్రొఫెస్సర్ కే. నాగేశ్వర్ నుంచీ నేర్చుకున్నాను. ఇదేరకమయిన అంశాలు మా ప్రొఫెస్సర్ తన వీడియో ద్వారా మళ్ళీ చర్చకు తెచ్చారు. అయితే తను క్లాస్ రూమ్ లో చెప్పిన బోధనకు వీడియోలోని కంటెంట్ కూ మధ్య వైరుధ్యం వుంది. ఎలా అంటే..?

పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడిగినట్టు ప్రొఫెసర్ వీడియో సారాంశం. హోమ్ మంత్రితో జరిగిన సమావేశం అంటే అత్యంత గోప్యమైనది. ఈ సబ్జెక్టు గురించి ఆ ముగ్గురు… అంటే హోమ్ మంత్రి, పవన్, మనోహర్ లకు మాత్రమే తెలుసు. వీరు తప్ప మరొకరు సమావేశంలో వుండే అవకాశం లేదు. మరి ప్రొఫెసర్ కి అలాంటి సమాచారం ఎలా తెలిసింది? తన సోర్స్ ద్వారా తెలిసింది అని ప్రొఫెస్సర్ అంటున్నారు. ఎవరా సోర్స్? ఆ ముగ్గురులో ఎవరో ఒకరా? వాళ్లల్లో ఎవరో ఒకరు ప్రొఫెసర్ కు మాత్రమే ఎక్సక్లూజివ్ గా చెప్పారా?

ఇక్కడ సోర్స్ ని రివీల్ చేయకుంటే అది గాలి వార్తే అవుద్ది. రివీల్ చేస్తే సోర్సుకు ప్రొటెక్షన్ ఉండదు. సోర్స్ ని రివీల్ చేయకపోవడంవల్ల ఇది ప్లాంటెడ్ స్టోరీనే అనుకోవాల్సి వస్తుంది. వెస్టెడ్ ఇంటరెస్ట్స్ తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఇలాంటి స్టోరీస్ ని ప్లాంట్ చేసేందుకు మీడియాను ఉపయోగిస్తూ ఉంటాయి. అదే నిజమయితే టీడీపీ, జనసేన పార్టీ నాయకుల ఆరోపణల్లో ఎదో కొంత నిజం ఉండొచ్చేమో..? అనే అనుమానం కలుగుతోంది.

మా ప్రొఫెసర్ ఎవరి ప్రయోజనాలనో కాపాడేందుకు తన క్రెడిబిలిటీని ఫణంగా పెట్టి ఇలాంటి వీడియో ని రిలీజ్ చేస్తారా? ప్రొఫెసర్ బేషరతుగా క్షమాపణ చెప్పి తన కంటెంట్ లోని సారాంశాన్ని వెనక్కు తీసుకోవాల్సివచ్చింది అంటేనే ఆ వార్తలో పసలేనట్టే కదా!

వార్త అనేది ఒక పదునైన కత్తి లాంటిది. దానికి రెండు వైపులా పదును ఉంటది. అవతల వాడి తలనే కాదు తేడా వస్తే వార్త రాసినవాడి తల కూడా నరికేస్తుంది. అంటే అది మహాభారతంలో బార్బరీకుడి అంబులపొదిలోని తిరుగులేని తృతీయాస్త్రం లాంటిది. గురిపెట్టినవే కాదు గురిపెట్టని టార్గెట్స్ ని కూడా ఈ అస్త్రం నాశనం చేస్తుంది. అంటే చివరికి గురిపెట్టిన విలుకాడిని కూడా అని అర్తం.

వార్తలో పస ఉంటే వార్త చెప్పిన వ్యక్తిని అమాంతం హిమాలయ శిఖరం మీద అయినా అది నిలబెడుతుంది. తేడా వస్తే పాతాళానికి కూడా తోసేస్తుంది. ప్రొఫెసర్ విషయంలో ఇప్పుడు జరిగింది అదే. ఎంతటి వారయినా సరే వార్తకు తర తమ భేదాలు వుండవ్!

Popular Articles