బెంగళూరు: బెంగళూరులో ఎబోలా వైరస్ బాధిత అనుమానిత కేసు వెలుగు చూసింది. ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళకు ఒకరు ఒళ్లు నొప్పులు సహా తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఆమెను ఓ హోటల్ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. ఈమె అనారోగ్య లక్షణాలను ఎబోలా అనుమానిత కేసుగా భావిస్తున్నారు. ఈ మహిళ ఇటీవలే ఉగాండా నుంచి అహ్మదాబాద్ కు ప్రయాణించి, ఆ తర్వాత బెంగళూరుకు చేరుకున్నట్లు స్థానిక సర్జన్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా వైరస్ భయం నెలకొన్న పరిస్థితుల్లో బెంగళూరులో వెలుగుచూసిన అనుమానిత కేసు అప్రమత్తతపై హెచ్చరిస్తోంది. అనుమానిత కేసుకు సంబంధించి బాధిత మహిళ నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగానికి టెస్టుల కోసం పంపినట్లు వైద్య వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి నిలకడగా ఉందని కూడా పేర్కొన్నాయి. ఈ ఘటనపై కర్నాటక ఆరోగ్య శాఖ స్పందిస్తూ, ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించిన వ్యక్తులు తిరిగి వచ్చిన తర్వాత 21 రోజులపాటు ఆరోగ్య పర్యవేక్షణ, స్వీయ క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.

ఇదిలా ఉండగా ఎబోలా వైరస్ కు తాము వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ అంశంపై రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కోతోపాటు సౌత్ ఆఫ్రికాలోని రష్యా దౌత్య కార్యాలయం కూడా వెల్లడించింది. వ్యాక్సిన్ తయారీకి రష్యా శాస్త్రవేత్తలు అద్భుతంగా కృషి చేశారని, ఇది ఎబోలా వైరస్ కు కారకమైన బుండిబుగ్యో స్ట్రెయిన్ ను అడ్డుకోలదని పేర్కొంది. GamEvac-Combiగా పిలిచే ఈ వ్యాక్సిన్ గినియా వంటి దేశాల్లో దశలవారీ పరీక్షలను ఎదుర్కున్నదని తెలిపింది. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే.
Update:
కాగా ఈ అనుమానిత కేసుకు సంబంధించి మహిళకు జరిపిన పరీక్షల్లో ఆమెకు ఎబోలా నెగిటివ్ గా తేలింది.

