Top 5 This Week

Related Posts

జింకల ‘వేటగాళ్ల’ ముఠా అరెస్ట్

హైదరాబాద్: షాద్ నగర్, మక్తల్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దుప్పులను, నెమళ్లను, కుందేళ్లను, కౌజు పిట్టలను, పావురాలను వేటాడుతున్న ఆరుగురు వేటగాళ్ల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 8.00 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నాలుగు ఎయిర్ గన్ లు, ఒక లైసెన్సుడ్ రైఫిల్, 20 తూటాలు, స్కార్పియో వాహనం, ఎనిమిది మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

ఈ ఘటనలో నిందితులైన హైదరాబాద్ నగరంలోని కట్టమైసమ్మ కమాన్ అలీజకోట్లకు చెందిన మహ్మద్ ముజాఫర్ హుస్సేన్ (42), జడ్చర్లకు చెందిన మీర్ అహ్మద్ అమీర్ (27), చార్మినార్ కు చెందిన అబ్దుల్లా బిన్ సాహెయిన్ (27), మొఘల్ పురాకు చెందిన సైద్ బిన్ మహ్మద్ బలాబ్ (41), మసూద్ బిన్ మహ్మద్ (43), నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన కె. శేఖర్ (38) అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ ఎ. శ్రీనివాసరావు తెలిపారు.

అరెస్ట్ చేసిన వేటగాళ్ల ముఠాతో టాస్క్ ఫోర్స్ పోలీసులు

గోల్కొండ టాస్క్ ఫోర్స్ కమిషనర్ టీం, అటవీ శాఖ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి వేటగాళ్ల ముఠాను అరెస్ట్ చేశామన్నారు. తెలంగాణా రైఫిల్ షూటర్స్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెషనల్ షూటర్ మీర్ అహ్మద్ అమీర్ వద్ద గల లైసెన్సుడ్ గన్ ను ముఠా వద్ద కనుగొన్నట్లు చెప్పారు. నారాయణపేటకు చెందిన కావలి శేఖర్ అనే వ్యక్తి కమిషన్ డబ్బుల కోసం నిందితులకు వన్యప్రాణుల ఆనవాళ్లను చూపించే ఇన్ఫార్మర్ గా వ్యవహరించినట్లు ఆయన వివరించారు. ఈ ముఠా షాద్ నగర్, మక్తల్ అడవుల్లో దుప్పులను, నెమళ్లను, కుందేళ్లను, కౌజు పిట్టలను, పావురాలను వేటాడేవారని పేర్కొన్నారు.

వేటాడిన దుప్పిన వేటగాళ్లు తమ మొబైల్ లో చిత్రీకరించిన దృశ్యం

గడచిన ఏడాది కాలంలో ఆరుగురు సభ్యులు గల ఈ వేటగాళ్ల ముఠా అనేక ఘటనలకు పాల్పడినట్లు టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ వివరించారు. నిరుడు జనవరి 15వ తేదీన నెమలిని, అదే సంవత్సరం మార్చి 18న అడవి పందిని, నిరుడు ఏప్రిల్ 15, 24 తేదీల్లో మక్తల్ అడవుల్లో రెండు దుప్పులను, మే నెలలో ఇదే అడవుల్లో అడవి జింకలను, అదే నెల 25వ తేదీన మూడు దుప్పులను వేటాడినట్లు చెప్పారు. గత జూలై 14వ తేదీన అడవి జింకను కాల్చి చంపి నిందితులు భుజించారని, గత నవంబర్ లో మరో జింకను చంపారన్నారు. గత ఫిబ్రవరి 18న కూడా మరో దుప్పిని వేటాడి నిందితులంగా తిన్నారని తెలిపారు.

వేటాడిన దుప్పిని మంసంగా మారుస్తూ వేటగాళ్లు చిత్రీకరించిన వీడియోలోని దృశ్యం

ఇలా వన్యప్రాణులను వేటాడిన ప్రతీసారి నిందితులు వేటను వీడియో రికార్డింగ్ చేసి, మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసి మరీ వాటి మాంసాన్ని తినేవారని చెప్పారు. ఆ తర్వాత వన్యప్రాణుల తలలను, చర్మాలను, ఇతర అవశేషాలను సమీపంలో జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువల్లో పడేసేవారని చెప్పారు. వన్యప్రాణుల నిత్యవేటకు పాల్పడుతున్న ఈ ముఠాను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ ఈస్ట్ రేంజ్, హైదరాబాద్ డివిజన్ పారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వివరించారు. నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

Popular Articles