Top 5 This Week

Related Posts

సింగర్ మంగ్లీపై కేసు, ఏమిటీ వసూళ్ల వివాదం!?

హైదరాబాద్: సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాకలోని విజయపురి కాలనీకి చెందిన సింగపోగు సుబ్బారావు అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగ్లీపైనేగాక, ఆమె సోదరుడు శివపై, రమావత్ మధు, పాల్ అలియాస్ భరత్ చౌహాన్, పాల్ అలియాస్ శైలజ చౌహాన్ అనే వ్యక్తులపై పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 351(2), 352 సెక్షన్ల కింద, క్రైం నెం. 258/2026 ద్వారా కేసు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. నెలరోజుల క్రితం హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్, ఇతరులు న్యాయ సహాయం న్యాయవాది సుబ్బారావును సంప్రదించారు. అధిక రాబడి వస్తుందనే తప్పుడు హామీలతో మైక్రో ఫైనాన్స్ పథకాలతో డబ్బును పెట్టుబడులు పెట్టేవిధంగా ప్రేరేపించి,కొందరు తమను మోసం చేశారని సుబ్బారావుకు తెలిపారు. ఈ విధంగా రమావత్ మధు, పాల్ అలియాస్ భరత్ చౌహాన్, పాల్ అలియాస్ శైలజా చౌహాన్, మంగ్లీ సోదరుడు శివలతోపాటు మంగ్లి అలియాస్ సత్యవతి అనే వ్యక్తులు తమ క్లయింట్ల నుంచి దాదాపు రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10.00 కోట్ల వరకు వసూళ్లు చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.

ఆయా విధంగా వసూళ్లు చేసిన మొత్తాన్ని “గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో దిగుమతి-ఎగుమతి (import-export), రియల్ ఎస్టేట్, వ్యాపార లావాదేవీల్లో పెట్టుబడి పెడతామని, లాభాలు రావడం ప్రారంభమయ్యే వరకు అధిక రాబడిని చెల్లిస్తామని మంగ్లీ సహా మిగతా వ్యక్తులు నమ్మబలికారు. ఈ విధంగా సుమారు 100 నుండి 150 మంది వ్యక్తులను మోసం చేసి, ఆ తర్వాత వారంతా పరారయ్యారని న్యాయవాది సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ నిందితులు ఆచూకీ తెలియరాలేదని, వారి మొబైల్ ఫోన్లు స్వచ్చాఫ్ చేసి ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తాను వాస్తవాలను నిర్దారించుకునేందుకు, న్యాయపరమైన చర్యలు చేపట్టినపుడు, ఆయా వ్యక్తులు తనను దూషించారని, తన వృత్తిని అవమానించారని, కేసును ముందుకు తీసుకువెళ్లవద్దని తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని సుబ్బారావు పేర్కొన్నారు. పంజాగుట్టలో జరిగిన ఓ సమావేశంలోనూ కేసును ఉపసంహరించుకోవలసిందిగా తనపై ఒత్తిడి తెచ్చారని, డబ్బును కూడా ఆఫర్ చేశారని, అయితే తాను తిరస్కరించినట్లు న్యాయవాది తెలిపారు. ఆయా వ్యక్తులు తనను వ్యక్తిగతంగానేగాక, పోన్ ద్వారా బెదరించారని, ప్రాణహాని సహా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారని, పలుకుబడి గల వ్యక్తులతో తనను భయపెట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు వివరించారు.

అందువల్ల ఆయా వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుబ్బారావు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. ఈమేరకు పంజాగుట్ట పోలీసులు మంగ్లీపై, ఆమె సోదరుడు శివపై, రమావత్ మధు, పాల్ అలియాస్ భరత్ చౌహాన్, పాల్ అలియాస్ శైలజ చౌహాన్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles