ఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు రెండింట మూడో వంతు మెజారిటీని సాధించలేకపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా, అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.
దీంతో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు అవసరమైన మెజారిటీ లేనందున బిల్లు వీగిపోయినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ పరిణామాల్లోనే మిగతా రెండు బిల్లులను కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ అధికారికంగానే ప్రకటించారు. అనంతరం లోక్ సభ శనివారానికి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గ సమావేశం శనివారం ఉదయం జరగనుంది. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ లో ఎన్డీఏ ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంట్ వెలుపల బీజేపీ మహిళా ఎంపీలు నిరసన తెలిపారు.
కాగా 131వ రాజ్యంగా సవరణ బిల్లు వీగిపోవడంపై ఎవరేమన్నారో ఓసారి చూద్దాం:
- రాజ్యంగ విరుద్ధమైన బిల్లులను ఓడించినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహిళా బిల్లు కాదని, దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చే కుట్రను అడ్డుకున్నట్లు చెప్పారు. తాము 2023 మహిళా బిల్లును ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
- ఈ పద్ధతిలో మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించినట్లు కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు. పాత జనాభా లెక్కలతో బిల్లు ఆమోదయోగ్యం కాదన్నారు.
- తమిళనాడు ఢిల్లీని ఓడించినట్లు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈనెల 23న ఢిల్లీ అహంకారాన్ని, దాన్ని సమర్ధించే బానిసలను ఓడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు వీగిపోయిందన్నారు.
- ఇది జాతీయ విపత్తును అడ్డుకున్న చరిత్రాత్మక, సువర్ణదినంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
- మహిళా రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకున్నారని, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు అడ్డుకున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బిల్లును అడ్డుకుని విజయం సాధించినట్లు నినదించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

